: షర్మిలా... మీరు వచ్చి మా ఇంట్లో ఉండచ్చు: మణిపూర్ 'ఉక్కుమహిళ'కు బాలీవుడ్ నటి ఆహ్వానం

16 ఏళ్ల పాటు రాష్ట్ర హక్కుల కోసం నిర్విరామంగా పోరాడి విమర్శలపాలవుతున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిలకు బాలీవుడ్ నటి రేణుకా సహానీ ఆశ్రయం ఇస్తానని ముందుకొచ్చింది. 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో సల్మాన్ కు వదినగా నటించిన రేణుక ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ... ‘ఇరోం షర్మిల.. తలదాచుకోవడానికి మీకు ఎక్కడా స్థానం లేకపోతే ముంబయిలో నా ఇంట్లో ఉండండి. మీరు నా ఇంట్లో ఉండడాన్ని నేను గౌరవంగా భావిస్తాను. 2000 సంవత్సరంలో మానవహక్కుల పరిరక్షణకు నిరాహార దీక్షకు దిగినప్పుడు మిమ్మల్ని కొందరు వ్యతిరేకించారు. 16 ఏళ్లు పోరాడి, దీక్ష విరమిస్తానంటే కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు అనుభవించిన బాధ, ఎదుర్కొన్న కష్టాలు వేరెవ్వరూ అనుభవించలేరు. రాజకీయపరంగా నేను తెలివిగల దాన్నని అనుకోవడంలేదు. అయితే ఓ మహిళ నిర్ణయం, ఇష్టాయిష్టాలను వ్యతిరేకించడాన్ని నేను తప్పు అంటున్నాను. 16 ఏళ్లు ఆసుపత్రినే నివాసంగా చేసుకున్న మీరు, సరికొత్త జీవితం ప్రారంభిస్తానంటే కుటుంబం, స్నేహితులు, సమాజం మిమ్మల్ని తప్పుపడుతున్నాయి. అదే బాధగా ఉంది. మీకు ఇష్టమైతే మీరు ముంబైలోని నా ఇంట్లో ఉండొచ్చు' అని రేణుక పోస్ట్‌ పెట్టారు. గతంలో సల్మాన్ జింకల వేట కేసును న్యాయస్థానం కొట్టేసినప్పుడు కూడా...'జింకలు ఎందుకు వాటంతట అవే తుపాకీతో కాల్చుకున్నాయో నిగ్గుతేల్చాల్సింది పోలీసులే'నని ఆమె సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

More Telugu News