: ఏఎన్ 32లో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదు: కేంద్ర మంత్రి ప్రకటన

గత నెల 22న చెన్నైలోని తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరి, అదృశ్యమైన ఏఎన్ 32 విమానంలో ఏ ఒక్కరూ బతికి బట్టకట్టే అవకాశం లేదని లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ తంబిదురై అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయమంత్రి రామ్ రావు భామ్రే తెలిపారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, మిస్సైన ఏఎన్ 32 విమానంలో ప్రయాణిస్తున్న 29 మందిలో ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే విమానం ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నం కొనసాగుతుందని ఆయన తెలిపారు. చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో బంగాళాఖాతంలో ఏఎన్ 32 కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు ఉన్నాయన్నారు. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో ఆ పరిసరాల్లో 20 నౌకలు, 18 విమానాలు, హెలికాప్టర్లతో గాలింపు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా శాటిలైట్ సహాయం తీసుకున్నా, భారత పరిశోధక నౌకలు రంగంలోకి దిగినా ఉపయోగం లేకపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News