: కోతిలా ఉన్నావన్నారు... జూలో ఉండాల్సిందన్నారు... అవే నోళ్లతో ఇప్పుడంతా ఆమెను అభినందిస్తున్నారు!

రాఫీలా సిల్వ బ్రెజిల్ జూడో క్రీడాకారిణి... 2012లో లండన్ ఒలింపిక్స్ లో పాల్గొని రిక్తహస్తాలతో వెనుదిరిగిన వేళ ఆమె ఎదుర్కొన్నన్ని అవమానాలు మరెవరూ ఎదుర్కొని ఉండరు. జాతి వివక్ష వ్యాఖ్యలతో పాటు... కోతిలా ఉన్నావని ఆమె ముందే ఎద్దేవా చేసేవారు. అసలు జనాల్లో ఎలా ఉంటున్నావు? జూలో కదా ఉండాలి? అంటూ ఏడిపించేవారు. అయితే రాఫీలా మాత్రం తన సామర్థ్యంపై నమ్మకాన్ని ఏనాడూ కోల్పోలేదు. నిఖార్సయిన క్రీడా స్పూర్తిని ప్రదర్శించింది. ఏనాడూ తనను విమర్శించిన వారికి జవాబివ్వలేదు. తాజాగా స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్ లో సత్తాచాటింది. అప్పట్లో ఎవరైతే తనను హేళన చేశారో వారంతా ఇప్పుడు రఫీలా అద్భుతమైన క్రీడాకారిణి అని ఎలుగెత్తి చాటుతున్నారు. ఎందుకంటే, రఫీలా జూడో బ్రెజిల్ కు స్వర్ణపతకాన్ని అందించింది. ఇప్పటివరకు ఒలింపిక్స్ లో స్వర్ణపతం ముఖం చూడని దేశానికి స్వర్ణం అందించిన తొలి క్రీడాకారిణిగా అవతరించింది. అది కూడా ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి, మంగోలియాకు చెందిన సుమియా డార్జుసురెన్ ను ఓడించి మరీ బంగారు పతకం సాధించింది. పతకం సాధించిన అనంతరం రఫీలా మాట్లాడుతూ, బోనులో ఉండాల్సిన కోతి లండన్ కు వచ్చిందంటూ అప్పట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తాను, నేడు స్వదేశంలో స్వర్ణంతో సమాధానం చెప్పానని తెలిపింది. జాత్యహంకారంతో వివక్ష చూపితే దానిని భరించడం ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమంటూ కన్నీటి పర్యంతమయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆమెను ఒదార్చేందుకు ముందుకు వస్తోంది.

More Telugu News