ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయీమ్ క్రైమ్ స్టోరీ... మాజీ నక్సలైట్లు కూడా నయీమ్ కు ఎందుకు భయపడతారంటే..!

Thu, Aug 11, 2016, 04:02 PM
నయీమ్ క్రైం స్టోరీ ఎలా ఉంటుందంటే...ప్లాన్డ్ గా లేపేసే నక్సలైట్లను కూడా భయపెట్టేంత భయంకరంగా ఉంటుంది. మాజీ నక్సలైట్ అయిన నయీమ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు అదే నక్సలైట్లను వినియోగించుకున్నాడు. తెలుగు సినిమాల్లో చెప్పినట్టు నేర సామ్రాజ్యంలో ఒకసారి అడుగుపెడితే పులిమీద స్వారీ చేస్తున్నట్టే... స్వారీ చేస్తున్నంత సేపు ఇతరులను చంపుకుంటూ వెళ్తాం... పొరపాటున కిందకి దిగితే అదే పులి మనల్ని చంపేస్తుంది.

ఒకసారి నక్సల్బరీ ఉద్యమంలో దిగిన తరువాత ఇక శత్రువులను హత్యలు చేసుకుంటూ వెళ్లాలి. ఈ క్రమంలో ఏదో ఒకరోజు హతం కావడం పెద్ద విషయం కాదు. అలా కాకుండా ఉద్యమం నుంచి నిష్క్రమించి, జనజీవన స్రవంతిలో కలవాలంటే ముందుగా పోలీసులను ఎదుర్కోవాలి. ఆ తరువాత కేసులు ఎదుర్కోవాలి. అక్కడ కూడా తప్పించుకుని బయటపడితే గతంలో తమ కారణంగా నష్టపోయిన వారిని ఎదుర్కోవాలి.

ఇలా బయటకు వచ్చిన వారు సమాజాన్ని ఎదుర్కోవడం మరింత కష్టం. ఇలాంటి వారిని నయీమ్ టార్గెట్ చేసుకునేవాడు. ఇలా ప్రశాంత జీవనం గడుపుతున్న వారందర్నీ ఏకతాటి మీదికి తీసుకొచ్చేవాడు. వారి అవసరాలకు సాయం చేస్తున్నానన్న ముసుగులో నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. జైలు నుంచి విడుదలయ్యే ప్రతి మావోయిస్టు నయీమ్ ను కలవాల్సిందేనంటే అతిశయోక్తికాదు. అలా కలవకుండా ఎవరైనా మొండికేస్తే... వారికి మూడినట్టే. తనతో అనుబంధం కలిగిన మాజీలను పంపి, వారిని రప్పించి తన ముందు కూర్చోబెట్టుకుంటాడు. తరువాత బట్టలు విప్పించి వారి పిరుదులపై సూదులతో గుచ్చుతాడు. తరువాత వారిని బంగారం లేదా ఇనుము నమలమంటాడు. ఇది అర్థమయ్యేసరికి వారి పళ్లూడాల్సిందే.

ఇంకా ఎవరైనా మొడికేస్తే వారి మర్మాంగాన్ని లక్ష్యం చేసుకుంటాడు. అక్కడ సూదులతో గుచ్చుతాడు. దీంతో ఆ నరకం భరించడం వల్లకాని వారంతా అతని గూటికి చేరాల్సిందే. ఇంకా మొండికేసిన వారుంటే మర్మాంగంపై సూదులుగుచ్చిన ప్రాంతంలో కారం చల్లుతాడు. దీంతో ఎంత మొండివారైనా అతని మాట వినాల్సిందే. ఇలా సుమారు 125 మంది మాజీ ఉద్యమకారులను నయీమ్ ప్రత్యక్ష అనుచరులుగా చేసుకున్నాడు. పరోక్షంగా మరో 750 మంది వరకు నయీమ్ అనుచరులని రికార్డులు చెబుతున్నాయి. ఎవరినైనా లేపేయాలన్నా, ఎవరి వద్దనుంచైనా వసూళ్లు చేేయాలన్నా నయీమ్ నేరుగా ఎంటర్ కాడు. వీరే ఆ పని కానిచ్చేస్తారు. తేడా వస్తే వీరే రికార్డుల్లో నిందితుడి పేరు లేకుండా చేసేస్తారు.

మావోయిస్టు ఎవరు లొంగిపోయినా ముందుగా తనను కలవాల్సిందేనని నయీమ్ హుకూం జారీ చేసేవాడు. తేడా వస్తే తన స్టైల్ లో అవతలి వ్యక్తికి బుద్ధి చెబుతాడు. తాజాగా మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామరక్షక దళం వ్యక్తి ‘‘నయీమ్‌ ఎవరు? ఏం పీకుతాడు?’’ అన్నాడన్న విషయం అతనికి తెలిసింది. అంతే.. రెండు రోజుల్లో అతణ్ని పట్టుకొని మర్మాంగాలు కోసేసి జేబులో పెట్టి వెళ్లిపోయారని ఓ మాజీ నక్సలైట్ చెప్పడం కొసమెరుపు.

తన గ్యాంగ్‌ లో చేరి, తనకు సలామ్‌ కొట్టే వారిని నయీమ్ చాలా బాగా చూసుకుంటాడని, నెలనెలా వేతనాలు, అలవెన్సులు, వాహనాలు కూడా బహుమతిగా ఇస్తాడని పోలీసులు గుర్తించారు. ప్రతినెలా హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో గల మైసిగండి వద్ద తన అనుచరులందరికీ ప్రత్యేక విందు ఇస్తాడని వారు గుర్తించారు.

ఇదే నయీమ్ మీటింగ్ పాయింట్ అని, ఇక్కడే తన ఆదేశాలు అనుచరులకు నేరుగా వివరిస్తాడని తెలుస్తోంది. అనుచరులు (మాజీలు) తెలివిమీరి సొంతంగా అంటే నయీమ్ కు తెలియకుండా సెటిల్‌ మెంట్లు చేసే ధైర్యం చేస్తే కఠినశిక్ష విధిస్తాడని వారు చెబుతున్నారు. నయీమ్ గ్యాంగ్‌ లో నక్సలైట్లుగా సక్సెస్ అయిన శేషన్న, విద్యాసాగర్‌, బాలన్న, రామకృష్ణలు కూడా ఉన్నారంటే అతని నేరాల స్టైల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా లొంగని నక్సలైట్లను ఖరీదైన షాపింగ్‌ తో లొంగదీసుకునే ప్రయత్నం చేసేవాడని, నయీమ్ చేతిలో హత్యకు గురైన కోనపురి రాములుతో నిజామాబాద్‌ లో భారీ షాపింగ్‌ చేయించాడని, అయితే రాములు అతను కొనిచ్చిన వస్తువులన్నింటినీ పక్కన పడేయడంతో వారిద్దరి మధ్య వివాదానికి ఆజ్యం పోసిందని తెలుస్తోంది.

దానికి తోడు 2009లో ఆలేరులో వినాయక ఉత్సవాలకు నయీమ్ రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మంది మాజీ నక్సల్స్‌ను రప్పించాడని, ఆ ఉత్సవాలకు హాజరైన ప్రముఖ మాజీల పేర్లు పత్రికల్లో వచ్చేలా చేయడాన్ని రాములు ఖండించాడని, దీంతో వారిద్ధరి మధ్య వివాదం ముదరడానికి తోడు నయీమ్ ను రాములు పెద్దగా పట్టించుకునేవాడు కాదని, దీంతో పథకం ప్రకారం రాములును నయీమ్ హత్య చేశాడని సమాచారం.

అయితే ఈ నేర సామ్రాజ్యం కేవలం నయీమ్ అంతంతోనే ముగిసిపోలేదని, అతని ప్రధాన అనుచరులు శేషన్న, బాలన్న, విద్యాసాగర్ ల రూపంలో బతికే ఉందని, నయీమ్ సామ్రాజ్యానికి వీరే భవిష్యత్ నేతలు అవుతారని పలువురు మాజీ నక్సలైట్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ప్రశాంతమైన జీవితం గడపడం తమకు సాధ్యం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.162.44.105
Articles (Latest)
Articles (Education)