: ఆఫ్గనిస్థాన్ కు మరింత సైనిక సాయం చేయండి: భారత్ ను కోరిన అమెరికా

తాలిబాన్ తీవ్రవాదుల దాడులు, అరాచకత్వంతో నలుగుతున్న ఆఫ్గనిస్థాన్ కు భారత్ మరింతగా దగ్గరవ్వాలని అమెరికా ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే నాలుగు ఎంఐ-25 యుద్ధ విమానాలను ఆఫ్గన్ కు భారత్ బహుమతిగా ఇవ్వగా, ఇవన్నీ తీవ్రవాదులపై పోరులో ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆఫ్గన్ ప్రభుత్వానికి భారత్ దగ్గరవుతుండటాన్ని జీర్ణించుకోలేక పోతున్న పాక్, ఓ వైపు నుంచి మోకాలొడ్డుతున్నప్పటికీ, అమెరికా మాత్రం ఆఫ్గన్, భారత్ ల మైత్రికి మద్దతు పలుకుతోంది. ఆఫ్గనిస్థాన్ కు మరింత సైనిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆఫ్గన్ మరిన్ని హెలికాప్టర్లను అడిగితే, వాటిని వెంటనే అందించేందుకు ఇండియా కృషి చేయాలని ఆ దేశంలో సేవలందిస్తున్న అమెరికా సైన్యం కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ జాన్ నికోలస్ వ్యాఖ్యానించారు. నేడు భారత పర్యటనకు వచ్చి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్, రక్షణ శాఖ కార్యదర్శి మోహన్ కుమార్ తో చర్చలు జరిపిన ఆయన, ఆఫ్గన్ తో మైత్రి కొనసాగించాలని, అమెరికా, భారత్ ల సంయుక్త సహకారంతో ఆఫ్గన్ మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. అక్కడి అవసరాల నిమిత్తం మరిన్ని చాపర్లు కావాల్సి వుందని తెలిపారు.

More Telugu News