: ప్రతి 15 నిమిషాలకో కారు చోరీ.. కేవ‌లం 13 శాతం మాత్ర‌మే రిక‌వ‌రీ

ఢిల్లీలో కార్ల వాడ‌కం అధికంగానే ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే కార్ల చోరీలు కూడా అదేస్థాయిలో జ‌రిగిపోతున్నాయి. ఢిల్లీలో కార్ల‌చోరీపై తాజాగా వెల్ల‌డించిన ప్ర‌భుత్వ గ‌ణాంకాల్లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వాస్తవాలు తెలిశాయి. ప్రతి 15 నిమిషాల‌కి ఓ కారు చోరీకి గుర‌వుతుంద‌ట‌. 2011లో న‌మోద‌యిన వాహ‌న దొంగ‌త‌నాల కేసుల కంటే, ఈ ఏడాది రెండింతలు ఎక్కువ నమోదయ్యాయని, గ‌త నెల‌లో ప్ర‌తిరోజు 100 వాహ‌నాలు చోరీకి గుర‌య్యాయ‌ని పోలీసు అధికారులు పేర్కొన్నారు. చోరీ అవుతున్న వాటిల్లో కేవ‌లం 13శాతం వాహ‌నాలు మాత్ర‌మే రిక‌వ‌రీ అవుతున్నాయ‌ని తెలిపారు. ఇక ద్విచక్ర వాహనాల రికవరీ శాతం 70గా ఉంద‌ని వారు చెప్పారు. అధిక సంఖ్య‌లో వాహ‌నాల వాడ‌కం పెరగ‌డంతో పాటు వాటికి స‌రిప‌డా పార్కింగ్ సౌక‌ర్యం లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణంగా మారింద‌ని తెలిపారు. తూర్పు ఢిల్లీలో ఈచోరీల ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా వెలుగులోకొస్తున్నాయ‌ని, అక్క‌డ గ‌త నెల‌లో 517 వాహ‌నాలు చోరీ అయిన‌ట్లు అధికారులు తెలిపారు. అవుటర్ డిస్ట్రిక్ట్ లో 492, పశ్చిమ ఢిల్లీలో 478 వాహనాలు చోరీకి గుర‌య్యాయ‌ని వారు పేర్కొన్నారు. ఎస్ యూవీల్లో ర‌క్ష‌ణ ఏర్పాట్లు ఉండ‌డంతో వాటిక‌న్నా చిన్నకార్లనే చోరీ చేయ‌డానికి దొంగ‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వారు చెప్పారు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం క‌న్నా రాత్రి సమయాల్లో వాహ‌నాల దొంగ‌త‌నాలు అధికంగా ఉన్న‌ట్లు తెలిపారు. వాహ‌నాల చోరీ కోసం దొంగ‌లు మాస్టర్ కీస్, బ్రేక్ లాక్ వాడుతున్నార‌ని అధికారులు తెలిపారు.

More Telugu News