: ఇంట్రస్టింగ్ స్టోరీ... గుజరాత్ లో 'దేవీ మాత'గా భావిస్తూ, ముస్లిం యువతికి శతాబ్దాలుగా పూజలు!

గుజరాత్ లోని గాంధీనగర్ కు దగ్గర్లోని ఝులాసన్ గ్రామంలో ఓ ముస్లిం యువతిని అక్కడి ప్రజలు 'దేవీ మాత'గా అభివర్ణిస్తూ గుడి కట్టి పూజలు చేస్తున్న ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేకపోవడం గమనార్హం. ఇక్కడున్న ఆలయం దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మితం కాగా, ఆలయ చరిత్రను స్థానిక బీజేపీ నేత ముఖేష్ పటేల్, ప్రముఖ న్యూస్ ఏజన్సీ 'బీబీసీ'తో పంచుకున్నారు. "శతాబ్దాల క్రితం ఈ గ్రామంపై దాడి చేసిన దోపిడీదారులు గ్రామంలోని ప్రజల నుంచి దోచుకుని వెళుతుంటే, పక్క గ్రామానికి చెందిన ఓ ముస్లిం మహిళ వారిని అడ్డుకుంది. ఎంతో ధైర్యాన్ని చూపిన ఆమె, వారిని నిలువరించే ప్రయత్నంలో తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె ధైర్యసాహసాలకు గుర్తుగా, గ్రామంలోని వారు 'డోలా మాతా దేవి' గుడి కట్టించి, ఆమెను పార్వతీ దేవి అవతారంగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆమె చనిపోయిన చోటనే ప్రస్తుతం గుడి ఉంది" అని చెప్పారు. ఆ దేవిని పూజిస్తే మేలు జరుగుతుందన్నది ఇక్కడి ప్రజల నమ్మకమని తెలిపారు. కాగా, ఈ గ్రామానికి ప్రముఖ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, తన తండ్రితో కలసి వచ్చి, ఇక్కడి 'డోలా మాతా దేవి' ఆలయాన్ని సందర్శించిన వేళ, ఈ గ్రామం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వారి సొంత గ్రామం కూడా ఇదే. విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా తన చిన్న వయసులో 22 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నారు.

More Telugu News