: సావిత్రి నదిలో 8 రోజుల తరువాత కనిపించిన బస్సుల భాగాలు... మొసళ్లకు ఆహారమైపోయిన మృతదేహాలు?

భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో సావిత్రీ నది ఉప్పొంగుతున్న వేళ, బ్రిటీష్ కాలం నాటి వంతెన కుప్పకూలి రెండు బస్సులు, నాలుగు కార్లు గల్లంతైన ఘటన జరిగిన 8 రోజుల తరువాత బస్సు ఆనవాళ్లు కనిపించాయి. కూలిన వంతెనకు 170 నుంచి 200 మీటర్ల దూరంలో బస్సుకు చెందిన రెండు విడిభాగాలు కనిపించాయని సెర్చ్ ఆపరేషన్లు జరుపుతున్న రక్షణ రంగ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 26 మంది మృతదేహాలను వెలికి తీయగా, మరో 14 మంది మృతదేహాలు లభించలేదు. కొట్టుకుపోయిన బస్సు ప్రధాన భాగాలు ఇంకా లభించలేదని, సావిత్రీ నది పరీవాహక ప్రాంతాల్లో మొసళ్లు సంచరించే ప్రాంతాలు అధికంగా ఉన్నందున కొన్ని మృతదేహాలు వాటికి ఆహారమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అన్ని మృతదేహాలు లేదా అందరి ఆనవాళ్లు లభించే వరకూ సెర్చ్ కొనసాగుతుందని వివరించారు. ఈ ఘటన 2వ తేదీన మహారాష్ట్రలోని ముంబై - గోవా జాతీయ రహదారిపై మహద్ వద్ద జరిగిన సంగతి తెలిసిందే.

More Telugu News