: లాభాల్లో నిలిచిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా', అయినా వద్దని అమ్మేస్తున్న ఇన్వెస్టర్లు... ఏకంగా 10 శాతం బేర్ మన్న ఈక్విటీ

బ్యాంక్ ఆఫ్ బరోడా... ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ రూ. 424 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు రెండు త్రైమాసికాల్లో నష్టాలను నమోదు చేసిన సంస్థ, ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో మెరుగైన పనితీరును చూపినప్పటికీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మాత్రం నశించింది. బ్యాంకులో తిరిగిరాని రుణాల మొత్తం పెరిగిపోయిందని, ఇది ఎప్పటికైనా బ్యాంకు కొంపముంచుతుందని తెలుసుకున్న ఇన్వెస్టర్లు, నేటి ట్రేడింగ్ సెషన్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈక్విటీలను విక్రయించి బయటపడేందుకు పోటెత్తారు. దీంతో సంస్థ ఈక్విటీ 10 శాతానికి పైగా పడిపోయింది. ఉదయం 11:50 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 8.30 శాతం నష్టంతో రూ. 13.30 పడిపోయి రూ. 147 వద్ద కొనసాగుతోంది. కాగా, ఈ మూడు నెలల కాలంలో సంస్థ నిరర్థక ఆస్తుల విలువ జనవరి - మార్చితో పోలిస్తే 6 శాతం పెరిగి రూ. 40,521 కోట్ల నుంచి రూ. 42,992 కోట్లకు పెరగడమే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసిందని బ్యాంకింగ్ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News