: అంతటా భారీ వర్షాలు... 'ప్రకాశం'పై మాత్రం కరుణచూపని వరుణుడు, రైతన్న దిగాలు!

ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో సగటు వర్షపాతం కంటే, అధిక వర్షం నమోదైంది. ఎడారి ప్రాంతం అధికంగా ఉండే రాజస్థాన్ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు వరదలను చవిచూశాయి. దేశమంతటా విస్తారంగా వర్షాలు కురిపించిన వరుణుడు ప్రకాశం జిల్లాపై మాత్రం సీతకన్ను వేశాడు. ప్రకాశం జిల్లాలో లోటు వర్షపాతం కొనసాగుతోంది. కరవుతీరా వర్షాలు కురుస్తాయని భావించిన రైతాంగం ఇప్పుడు నిరాశలో కూరుకుపోయింది. వర్షాభావంతో మెట్టపంటలు చేతికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కూరగాయల పంటలు సాగు చేసిన రైతులకు, ధరల పరంగా తృప్తిగా ఉన్నా, గణనీయంగా తగ్గిన దిగుబడులు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. తొలకరి మొదలైనప్పటి నుంచి లోటు వర్షపాతమే జిల్లాలో నమోదవుతోంది. సాగర్ కుడి కాలువ ఆయకట్టు కింద భూములు మినహా మరే ప్రాంతానికీ నీరు దక్కని పరిస్థితి. ఖరీఫ్ లో సాధారణంగా 2.04 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు పండే జిల్లాలో ఇప్పుడు కాలం కలిసిరాక పోవడంతో, 60 శాతం భూమిలో మాత్రమే పంట ఉంది. కొద్దిపాటి నీటితో పంటనిచ్చే పచ్చిమిరపను అత్యధికులు సాగు చేస్తున్నారు. మార్కెట్లో 40 కిలోల మిర్చి ధర రూ. 1,600 నుంచి రూ. 1,800 వరకూ పలుకుతోంది. ఈ ధర రైతుకు గిట్టుబాటు అయ్యేదే. కానీ, నీరులేక తగ్గిన దిగుబడితో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎకరానికి రూ. 70 వేల వరకూ పెట్టుబడులు పెట్టగా, తొలి విడత పంటను అమ్మి రూ. 50 వేలు, రెండో విడత పంటలో రూ. 20 వేలు లభించిందని, మరో కోతకు కాలం కరుణించడం లేదని ఓ రైతు వాపోయాడు. సకాలంలో నీరందితే, ఎకరాకు రూ. 2 లక్షల వరకూ ఆదాయం వస్తుందని భావించామని, ఇప్పుడు పెట్టిన పెట్టుబడులే బొటాబొటిగా వస్తున్నాయని చెప్పాడు. అందరి పరిస్థితీ ఇలాగే ఉండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో రైతులు దిగులు పడుతున్నారు.

More Telugu News