: 353 పరుగులకు చాప చుట్టేసిన ఇండియా... దీటైన సమాధానమిస్తున్న వెస్టిండీస్

వెస్టిండీస్ లోని గ్రాస్ ఇస్ లెట్ మైదానంలో జరుగుతున్న మూడవ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ జట్టు 47 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టులో టాప్ ఆర్డర్ స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకోగా, మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రవిచంద్రన్ ఆశ్విన్ (297 బంతుల్లో 118), వృద్ధిమాన్ సాహా (227 బంతుల్లో 104) పరుగులు సాధించి రాణించడంతో 129.4 ఓవర్లలో 353 పరుగులు మాత్రమే సాధించి ఆలౌటైంది. చివరి ముగ్గురు బ్యాట్స్ మన్లు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సామీ, ఇషాంత్ శర్మలు డక్కౌట్ అయ్యారు. విండీస్ బౌలర్లలో జోసఫ్, కుమిన్స్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు 59 పరుగుల వద్ద జాన్సన్ (75 బంతుల్లో 23 పరుగులు) వికెట్ ను కోల్పోయినప్పటికీ, ఆపై సంయమనంతో ఆడి 100 పరుగుల మైలురాయిని దాటింది. ప్రస్తుతం బ్రాత్ వైట్ 53 పరుగులు, బ్రావో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి టెస్టులో అత్యద్భుతంగా ఆడి ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన భారత జట్టు, రెండో టెస్టులో వర్షం అడ్డు రావడంతో డ్రాతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో కీలకమైన మూడవ రోజు ఆటలో విండీస్ ఆటగాళ్లు నిలిస్తే, ఇది కూడా డ్రా దిశగా పయనమయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

More Telugu News