: 'అమ్మ' ఆజ్ఞను ధిక్కరించిన శశికళ పుష్ప... కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైనం!

తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత ఆజ్ఞను ధిక్కరిస్తే ఏమవుతుంది? సొంత పార్టీ వారైనా, బయటి పార్టీల వారైనా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనడానికి తాజా ఉదాహరణ అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప వివాదమే. రాజ్యసభలోనే జయలలితపై తీవ్ర విమర్శలు చేసిన శశికళ, ఇప్పుడు కేసులు వెల్లువెత్తడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో, ఢిల్లీలోని చిరునామా చూపుతూ, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శశికళ, ఆమె భర్త లింగేశ్వర తిలగం, కుమారుడు పృధ్వీరాజ్ లపై వస్తున్న ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటిపై దృష్టి పెట్టిన పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు దోచుకున్నారని, వేధించారని, దాడులు చేశారని ఇప్పటికే పలు ఫిర్యాదులు అందగా, నిన్న భానుమతి అనే మహిళ ఆమెపై హత్యారోపణలు చేయడం కలకలం రేపింది. తన భర్త శశికళ ఇంట్లో పనిచేస్తూ, మరణించారని, ఆయనతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని ఆమె కేసు పెట్టింది. ఈ కేసును పోలీసులు విచారణకు స్వీకరించారు. ఇక చెన్నైకి వెళితే తనకు న్యాయం జరిగే అవకాశాలు లేవని భావిస్తున్న శశికళ, ముందస్తు బెయిల్ కోసం సుప్రీం తలుపు తట్టిన వేళ, తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్య ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ముందస్తు బెయిల్ జారీ చేయకుండా, ఆమెపై, ఆమె భర్తపై ఉన్న కేసుల వివరాలు తన ముందుంచాలని న్యాయమూర్తి తమిళనాడు పోలీసులను ఆదేశించారు.

More Telugu News