: దేశవ్యాప్తంగా పెండింగ్‌లో 2 కోట్ల కేసులు.. వెల్లడించిన అత్యున్నత న్యాయస్థానం

దేశవ్యాప్తంగా 2.18 కోట్ల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఇ-కమిటీ గణాంకాలను అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 31, మే నాటికి 2.18 కోట్ల కేసులు పెండింగులో ఉండగా, వీటిలో 27 శాతం(59.3 లక్షలు) కేసులు ఐదేళ్లుకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 22.3 లక్షల కేసులు గత పదేళ్లుగా కోర్టు విచారణలో ఉన్నట్టు పేర్కొంది. ఏప్రిల్ 30 నాటికి 27.4 లక్షల కేసులు పెండింగులో ఉండగా, మే 31 నాటికి వాటి సంఖ్య 28.8 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. గత పదేళ్లలో పెండింగులో ఉన్న కేసుల్లో ఉత్తరప్రదేశ్ 6.6 లక్షలతో మొదటి స్థానంలో ఉంది. 5.2 లక్షలతో గుజరాత్, 2.51 లక్షలతో మహారాష్ట్ర, 2.3 లక్షలతో బీహార్, 1.83 లక్షలతో ఒడిశా, 1.51 లక్షలతో పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత పదేళ్లలో అత్యంత తక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రంగా పంజాబ్ రికార్డు సృష్టించింది. గత దశాబ్దకాలంగా ఆ రాష్ట్రంలో పెండింగులో ఉన్నవి 1,328 కేసులే. ఇక కోర్టుకెక్కన వారిలో మహిళలే అధికం. మొత్తం కేసుల్లో 7.1 లక్షల కేసులను సీనియర్ సిటిజన్లు వేయగా, మహిళలు వేసిన 21.4 లక్షల కేసులు ట్రయల్ కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. మహిళా కేసులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో నమోదయ్యాయి. 4.4 లక్షల మహిళా కేసులతో ఆ రాష్ట్రం టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ నిలిచాయి.

More Telugu News