: నా సింహాలు చచ్చిపోయాయి.. విచారణ జరిపించండి: లోక్‌సభలో ములాయం

‘‘నా సింహాలు చచ్చిపోయాయి. అవెలా చనిపోయాయో తక్షణమే విచారణ జరిపించండి’’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, సీనియర్ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభలో చేసిన డిమాండ్ పలువురిని ఆకర్షించింది. విచారణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. దీంతో సంబంధిత మంత్రి ఆయనకు హామీ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ మూడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ములాయం యాదవ్‌ల డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఎట్వా వైల్డ్‌లైఫ్ లయన్ సఫారీకి గుజరాత్ నుంచి మూడు సింహాలను బహుమానంగా ఇచ్చారు. ఇటీవల వాటిలో రెండు సింహాలు మృతి చెందాయి. దీంతో కలత చెందిన ములాయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘నా సింహాలు మృతి చెందాయి. మోదీ వాటిని గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనిపై విచారణ జరిపించండి. అవెలా చనిపోయాయో తెలియాలి. వాటి చావు వెనుక ఉన్న కారణాలేంటి? మా వైపు నుంచి తప్పుంటే సరిదిద్దుకుంటాం. కానీ విచారణ మాత్రం తప్పనిసరి’’ అని అన్నారు. దీంతో స్పందించిన పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే మాట్లాడుతూ సింహాల మృతి వెనుక గల కారణాలు తెలుసుకుంటామన్నారు. దర్యాప్తు జరిపిస్తామని ములాయంకు హామీ ఇచ్చారు.

More Telugu News