: మార్కెట్ పై రాజన్ ఎఫెక్ట్... 100 పాయింట్ల నష్టం

పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గించ బోవడం లేదన్న విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ స్వయంగా చెప్పిన వేళ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. రాజన్ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి క్రితం ముగింపునకు దగ్గరగా ఉన్న బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్, ఆపై అరగంట వ్యవధిలో 150 పాయింట్లకు పైగా పడిపోయింది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను విక్రయించేందుకే మొగ్గు చూపారు. బ్రాడర్ మార్కెట్లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 97.41 పాయింట్లు పడిపోయి 0.35 శాతం నష్టంతో 28,085.16 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 33.10 పాయింట్లు పడిపోయి 1.38 శాతం నష్టంతో 8,678.25 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.35 శాతం, స్మాల్ కాప్ 0.45 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 17 కంపెనీలు లాభపడ్డాయి. టాటా పవర్, జడ్ఈఈఎల్, ఇన్ ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐడియా, లుపిన్, అంబుజా సిమెంట్స్, గ్రాసిమ్, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,887 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,182 కంపెనీలు లాభాలను, 1,572 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,09,28,740 కోట్లుగా నమోదైంది.

More Telugu News