: మోదీకి ఎనిమిదో తరగతి విద్యార్థి లేఖ.. దిగొచ్చిన జిల్లా యంత్రాంగం

‘మోదీ అంకుల్.. మాకు మీ మీటింగ్ ముఖ్యమా? లేక స్కూలు ముఖ్యమా?’ అంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి రాసిన లేఖకు జిల్లా యంత్రాంగం ఆగమేఘాలపై దిగొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని భాబ్రా గ్రామంలో నేడు చంద్రశేఖర్ ఆజాద్‌కు నివాళులు అర్పించిన అనంతం మోదీ జోత్రాడా గ్రామంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ‘70 సాల్ ఆజాదీ, యాద్ కరో ఖుర్బానీ’ని ప్రారంభించనున్నారు. ప్రధాని సభకు ప్రజలను తరలించేందుకు జిల్లా యంత్రాంగం స్కూలు బస్సులను తరలించింది. దీంతో అక్కడి స్కూళ్లకు మంగళవారం, బుధవారం సెలవులు ప్రకటించారు. విద్యాకుంజ్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవాంశ్ జైన్ ఈ వార్త విని కలత చెందాడు. ప్రధాని కోసం తమ స్కూలు బస్సులు లాక్కొని పాఠశాలకు సెలవులు ప్రకటించడం ఏంటంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగక ఏకంగా ప్రధానికే లేఖ రాశాడు. ‘‘స్కూలు కంటే మీ మీటింగ్ అంత ముఖ్యమా?’’ అంటూ లేఖలో ప్రధానిని ప్రశ్నించాడు. ‘‘మీరు అమెరికాలో ప్రసంగించినప్పుడు వేలాదిమంది వచ్చారని విన్నాను. కానీ వారు స్కూలు బస్సుల్లో అక్కడికి రాలేదు’’ అని పేర్కొన్నాడు. తనను తాను మోదీ అభిమానిగా పేర్కొన్న దేవాంశ్ రేడియోలో వచ్చే ‘మన్ కీ బాత్’ను ఎప్పుడూ మిస్ కాలేదని తెలిపాడు.‘‘శివరాజ్ మామా(సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్) స్కూలు బస్సులను తీసుకోవద్దని ప్రధానికి మీరైనా చెప్పండి’’ అంటూ అందులో పేర్కొన్నాడు. బాలుడి లేఖ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో దిగొచ్చిన జిల్లా యంత్రాంగం వెంటనే స్కూలు బస్సులను తిరిగి ఇచ్చేసింది. ఈమేరకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్కూలు బస్సులను తీసుకోవడం తక్షణం నిలివేయాలంటూ అధికారులను ఆదేశించారు. అలాగే అసిస్టెంట్ ట్రాన్స్‌పోర్టు అధికారి సునీల్ గౌడ్ కూడా ఈ విషయంలో అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News