: భారత్‌లో శిక్ష అనుభవిస్తున్న నా సోదరుడిని విడిపించండి.. బ్రిటన్ ప్రధానికి మహిళ వేడుకోలు

మారణాయుధాలతో పట్టుబడి భారత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తన సోదరుడిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రిటిష్ మహిళ లిసా డన్ ప్రధాని థెరీసా మేను కోరారు. కమర్షియల్ షిప్‌లో మారణాయుధాలు తరలిస్తున్న 35 మందిని తమిళనాడు ప్రభుత్వం 2013లో అరెస్ట్ చేసింది. వారిని దోషులుగా తేల్చిన కోర్టు ఈ ఏడాది జనవరిలో ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో ఆరుగురు బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికులు ఉన్నారు. వీరిలో ఒకరైన నిక్ డన్ సోదరే లిసా డన్. దేశానికి ఎంతో సేవ చేసిన తన సోదరుడిని జైలు నుంచి విడిపించి స్వదేశం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని ధెరీసా మేను లిసా అభ్యర్థించారు. దేశానికి ఎనలేని సేవలు చేసినా గత ప్రభుత్వం తనకు తీరని ద్రోహం చేసిందని నిక్ భావిస్తున్నాడని లిసా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో తమకు ఆశలు చిగురించాయన్నారు. త్వరలో ప్రధాని థెరీసా మే, విదేశాంగ కార్యదర్శి జోరిస్ జాన్సన్, విదేశాంగ మంత్రి సర్ అలన్ డంకన్‌లను కలిసి తన సోదరుడిని విడిపించాల్సిందిగా కోరుతానని లిసా వివరించారు.

More Telugu News