: ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయండి: మోదీకి నీతి ఆయోగ్ సిఫార్సు

ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండి, లాభాలను ఆర్జించడంలో తీవ్రంగా విఫలమవుతున్న ఎనిమిది కంపెనీలను తక్షణం మూసివేయాలని నీతి ఆయోగ్ ప్రధాని నరేంద్ర మోదీకి సిఫార్సు చేసింది. "మొత్తం 74 ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. వాటిల్లో ఈ ఎనిమిదింటినీ తక్షణం మూసివేయడం లేదా విక్రయించడం జరపాలి. లేకుంటే వాటి ప్రభావం ఖజానాపై పడుతుంది" అని ఓ నివేదికను ప్రధాని కార్యాలయానికి పంపినట్టు తెలుస్తోంది. ప్రధాని కార్యాలయం నుంచి వీటి మూసివేతకు ప్రాథమిక అనుమతులు వచ్చిన తరవాతనే వీటి గురించి సంబంధిత మంత్రిత్వ శాఖలకు సమాచారం అందిస్తామని నీతి ఆయోగ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సంస్థల ఆస్తులు, అప్పుల గణనకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను తయారు చేశామని, వీటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంపై కూడా నివేదిక తయారైందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని వద్ద ఉన్న ఫైల్, ఆపై కేంద్ర క్యాబినెట్ ముందుకు వస్తుందని అధికారులు తెలిపారు. కోలుకోలేకుండా దిగజారిన పీఎస్యూలతో పాటు, తీవ్ర నష్టాల్లో ఇరుక్కున్న సంస్థల గురించిన రిపోర్టు కూడా ప్రధాని టేబుల్ పైకి చేరినట్టు సమాచారం. కాగా, 2016-17 బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో పీఎస్యూ సంస్థల్లో నష్టాల్లో నడుస్తున్న జాబితాను నీతి ఆయోగ్ అందిస్తుందని, ఆపై వీటి వ్యూహాత్మక విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 36 వేల కోట్లను, ఆపై వివిధ సంస్థల్లో వ్యూహాత్మక డీల్స్ ద్వారా రూ. 20,500 కోట్లను ఖజానాకు చేర్చాలని కేంద్రం నిర్ణయించుకుంది. 2015-16లో పీఎస్యూ కంపెనీల్లో డిజిన్వెస్ట్ మెంట్ ద్వారా రూ. 69,500 కోట్లను సేకరించాలని భావించిన కేంద్రం, తన లక్ష్య సాధనలో విఫలమై రూ. 25,312 కోట్లకే పరిమితమైంది.

More Telugu News