: హిల్లరీ టంగ్ స్లిప్!... ట్రంప్ ను భర్తగా పేర్కొని నాలిక్కరుచుకున్న హిల్లరీ!

అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ పార్టీల తరఫున అభ్యర్థులుగా ఖరారు కాకముందే వీరిద్దరూ పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీల నుంచి అధికారిక అభ్యర్థులుగా ఖరారైన తర్వాత వారు తమ మాటల దాడులను మరింతగా పెంచారు. ఈ క్రమంలో హిల్లరీ చేసిన ఓ కామెంట్... ఆమె ప్రసంగాన్ని వింటున్న వారినే కాకుండా నెటిజన్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్ ను తన ప్రత్యర్థిగా అభివర్ణించేందుకు బదులుగా హిల్లరీ... ఆయనను తన భర్తగా చెప్పింది. అయితే క్షణకాలంలో తాను చేసిన పొరపాటును గుర్తించిన ఆమె వెనువెంటనే సర్దుకున్నారు. ఈలోగా ఆమె నోట నుంచి వెలువడ్డ ‘భర్త’ అన్న పదం ఆమె ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన వారి చెవిన పడిపోయింది. దీంతో వారంతా గొల్లుమని నవ్వేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన నల్లజాతి, హిస్పానిక్ పాత్రికేయుల జాతీయ సంఘాల సమావేశంలో ప్రసంగించిన సందర్బంగా హిల్లరీ నాలిక స్లిప్పయ్యింది. ‘‘నా హస్బ్... నా ప్రత్యర్థి మాట్లాడుతున్న దాని గురించి నేను చెప్పేదాన్ని పోల్చి చూస్తారని ఆశిస్తున్నాను’’ అని హిల్లరీ పేర్కొన్నారు. ఈ వాక్యంలోని ‘హస్బ్’ అన్న పదం వినగానే సభికులు గొల్లుమనగా, హిల్లరీ వెంటనే సరద్దుకున్నారు.

More Telugu News