: నేనేమీ తిని రావడానికి వెళ్లలేదు... పాక్ ఎంత చేయగలదో అంతా చేసింది.: రాజ్ నాథ్ సింగ్

తన పట్ల పాకిస్థాన్ హుందాగా నడుచుకోలేదని, తానేమీ భోజనం చేసేందుకు ఆ దేశానికి వెళ్లలేదని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం రాజ్యసభలో మాట్లాడిన ఆయన తన పర్యటనపై ప్రకటన చేశారు. "పాకిస్థాన్ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్, ప్రతి ఒక్కరినీ లంచ్ కి పిలిచారు. అందరూ బయలుదేరుతుంటే, ఆయన తన కారులో వెళ్లిపోయారు. నేనూ వెళ్లిపోయాను. ఈ విషయంలో నేనేమీ ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు. నేను అక్కడికి తిని రావడానికి వెళ్లలేదు కదా" అని అన్నారు. తనతో పాటు వచ్చిన భారత మీడియాను సార్క్ సమావేశంలో తన ప్రసంగం వేళ అనుమతించలేదని స్పష్టం చేశారు. రిపోర్టర్లను అనుమతించని విషయంలో ప్రొటోకాల్స్ ఏమైనా ఉన్నాయా? అన్నది తనకు తెలియదని, గతంలో జరిగిన సార్క్ సమావేశాల్లో ఎలా నడుచుకున్నారో కూడా తెలియదని రాజ్ నాథ్ ఎంపీలకు తెలిపారు. పాకిస్థాన్ తప్పు చేసిందా? ఒప్పు చేసిందా? అన్న విషయమై ఇప్పుడు కామెంట్ చేయబోనని తెలిపారు. తన పట్ల వాళ్లు ఎంత చేయగలరో అంతా చేశారని మాత్రం చెప్పగలనని అన్నారు. అంతకుమించి చేసేందుకు వారివద్ద అవకాశాలు లేకపోయాయని తెలిపారు.

More Telugu News