: తాలిబాన్ తరహా ఆంక్షలు పెట్టిన భోపాల్ ఎన్ఐటీ... విద్యార్థినుల తీవ్ర నిరసన

భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నతాధికారులు పెట్టిన ఆంక్షలను తప్పుబడుతూ వందలాది మంది విద్యార్థినులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. తమకు డ్రస్ కోడ్ విధించడం, హాస్టల్ టైమింగ్స్ మార్చడంపై మండిపడుతూ వర్శిటీలో ప్రదర్శన నిర్వహించారు. తాము ఉదయం 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకూ క్లాసులకు హాజరవుతామని, ఆపై ప్రైవేట్ కోచింగ్ నిమిత్తం బయటకు వెళతామని చెబుతున్న అమ్మాయిలు, తమను హాస్టల్ గదుల్లోకి అనుమతించడం లేదని, దీంతో లాబీల్లోనే పడుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. రాత్రి 9:30 గంటలు దాటితే హాస్టళ్లలోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అమ్మాయిలు మినీ స్కర్టులు, షార్ట్స్ వేసుకోవడాన్నీ నిషేధించారు. ఇటువంటి తాలిబాన్ తరహా ఆజ్ఞలను తాము నిరసిస్తున్నామని, 21వ శతాబ్దంలో, తమకు నచ్చినట్టుగా ఉండేందుకు, సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు ధరించేందుకు స్వేచ్ఛ లేకుండా పోతోందని విద్యార్థినులు ఆరోపించారు. అబ్బాయిలకు ఇటువంటి నిబంధనలేమీ లేవని, అమ్మాయిల పట్లే వివక్ష చూపుతున్నారని తెలిపారు.

More Telugu News