: దేశంలో ప్రతీ 10 లక్షల మందికి 18 జడ్జీలే... దయనీయంగా మారుతున్న కేసుల పరిష్కారం

దేశంలో ప్రతీ పది లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు అందుబాటులో ఉండాల్సి ఉండగా కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పలు కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ప్రతీ 10 లక్షల మందికి కనీసంగా 50 మంది న్యాయమూర్తులు అందుబాటులో ఉండాలని లా కమిషన్ 1987లో తేల్చి చెప్పింది. ఈ విషయంపై దృష్టిసారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జడ్జీల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టారు. న్యాయశాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రతీ పది లక్షల మందికి సగటున 17.86 మంది జడ్జిలు అందుబాటులో ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం మిజోరం అత్యధికంగా 57.74 మంది జడ్జీలతో ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో 47.33 మందితో ఢిల్లీ కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో పది లక్షల మంది జనాభాకు కేవలం 10.54 మంది జడ్జీలే ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో అత్యంత తక్కువగా 10.45 మంది జడ్జీలు మాత్రమే సగటున అందుబాటులో ఉన్నారు. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో 2009లో ప్రధాన న్యాయమూర్తితో కలిసి 25 మంది న్యాయమూర్తులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 31కి చేరుకుంది. ఇక అపెక్స్ కోర్టులో ఇంకా ముగ్గురు జడ్జీల లోటు ఉంది. ఇటీవలే ఈ కోర్టులో నలుగురు జడ్జీలను నియమించారు. దేశంలో ఉన్న 24 హైకోర్టులలో 2014 వరకు 906 మంది జడ్జీలే ఉండగా ఈ ఏడాది జూన్ నాటికి వారి సంఖ్య 1,079కి పెరిగింది. అయినా ఇంకా 477 మంది జడ్జీల కొరత ఉంది. న్యాయమూర్తుల కొరత కారణంగా పలు కేసులకు సత్వర పరిష్కారం లభించడం లేదు. బాధితులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

More Telugu News