: పాక్‌లోనే పాకిస్థాన్‌కి వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్‌.. ఆయ‌న‌ ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రించిన‌ పాక్ మీడియా

సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశంలో పాల్గొన‌డానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ప‌ర్య‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స‌మావేశంలో ప్ర‌ధానంగా భార‌త్‌లో జ‌రిగిన‌ 26/11 ఉగ్ర‌దాడులు, ప‌ఠాన్‌కోట్ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడతార‌ని అంద‌రూ భావించారు. అయితే, ఆయ‌న పాకిస్థాన్‌పై తీవ్రంగా స్పందించారు. రాజ్‌నాథ్‌సింగ్‌ పాక్‌లోనే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చే దేశాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఉగ్ర‌వాదులు, ఉగ్ర సంస్థ‌ల‌పై మాత్ర‌మే చ‌ర్య‌లు తీసుకుంటే స‌రిపోద‌ని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. పాకిస్థాన్‌ను, ఆ దేశ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదుల్లో మంచివారు, చెడ్డవారు అని వేరుగా ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్ర‌వాదుల‌ను అమ‌ర‌వీరులుగా పొగ‌డ‌డం లాంటి చర్య‌లు ఆపేయాల‌ని అన్నారు. పాకిస్థాన్‌లోనే పాక్‌పై రాజ్‌నాథ్ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో ఆయ‌న‌ ప్ర‌సంగాన్ని ఆ దేశ‌ మీడియా బ‌హిష్క‌రించింది. మ‌రోవైపు రాజ్‌నాథ్ సింగ్ ప‌ర్య‌ట‌న‌ను నిర‌సిస్తూ పాకిస్థాన్‌లో ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు.

More Telugu News