: బస్సు, కార్లు ఎక్కడ... 300 కిలోల అయస్కాంతాలతో మ్యాసివ్ సెర్చ్!

మహద్ సమీపంలో బ్రిటీష్ కాలం నాటి వంతెన కూలిపోయి వాహనాలు గల్లంతైన వేళ, సావిత్రి నదిలో ఈ ఉదయం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. నదిలో నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో, ఎన్డీఆర్ఎఫ్ బృందాల వెతుకులాటకు ఆటంకాలు కలుగుతున్నాయని తెలుస్తోంది. నదిలో కొట్టుకుపోయిన బస్సు, కార్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని తేల్చేందుకు 300 కిలోల బరువైన అయస్కాంతాలను వినియోగిస్తున్నారు. నది 40 అడుగుల మేరకు ప్రవహిస్తుండగా, భారీ అయస్కాంతాలను చిన్న చిన్న రెస్క్యూ పడవలకు కట్టి నదిలో వదిలి సోదాలు జరుపుతున్నారు. అవి బలంగా కదిలిన వేళ, ఆ ప్రాంతంలో గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు నీటి అడుగుకు వెళుతున్నారు. ఈ ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బోట్ నీట మునగగా, వెంటనే స్పందించిన చాపర్ టీం వారిని రక్షించింది. బ్రిడ్జి కూలిన ఘటనలో రెండు బస్సులు, మూడు కార్లు గల్లంతైనట్టు తెలుస్తుండగా, వాటిల్లో ఒక్క వాహనం ఆచూకీ కూడా ఇంతవరకూ తెలియరాలేదు. మొత్తం 22 మంది వరకూ ఈ వాహనాల్లో ఉన్నారని అంచనా. 1940లో నిర్మించిన బ్రిడ్జ్ ప్రమాదకరమని, దీన్ని తొలగించాలని నిపుణులు హెచ్చరించినప్పటికీ, దీన్ని వాడుతూనే ఉంది మహారాష్ట్ర సర్కారు. పూర్తి ఇటుకలతో నిర్మించడం, దీని గోడల్లో మొలిచిన చెట్ల కారణంగా బలహీనమైపోయిన బ్రిడ్జ్, ఒక్కసారిగా దూసుకొచ్చిన భారీ వరదతో తెగి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News