: ‘రై’ సినిమా విషయంలో రాంగోపాల్ వర్మకు నోటీసులు

బెంగళూరులో డాన్‌ గా ముద్రపడి ప్రస్తుతం జయ కర్ణాటక సంఘం అధ్యక్షుడిగా ఉన్న ముత్తప్ప రై జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ‘రై’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ముత్తప్ప రైకి గతంలో స్నేహితుడిగా ఉన్న యూసుఫ్ బచ్చాఖాన్ తన లాయర్ ద్వారా వర్మకి నోటీసులు పంపించారు. 'రై' సినిమాలో తన పాత్రను వర్మ పూర్తిగా నెగిటివ్ రోల్ (విలన్) గా చిత్రీకరిస్తున్నారని, కథ మొత్తం తనకు వినిపించిన తరువాతే సినిమా తీయాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. అలా కాకుండా సినిమా తీసేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి యూసుఫ్ బచ్చాఖాన్ భూ కబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం తదితర అభియోగాలతో కర్ణాటకలోని ధార్వాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే దీనిపై రామ్‌ గోపాల్ వర్మ న్యాయస్థానం ద్వారానే సమాధానమివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'వీరప్పన్' సినిమా విజయం జోష్ లో ఉన్న వర్మ, మరో గ్యాంగ్ స్టర్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఊహించని ప్రచారం కూడా వర్మకు కలిసివచ్చేలా కనిపిస్తోంది.

More Telugu News