: ఇక చాలు...వేధించకండి...చెప్పాల్సిందంతా చెప్పేశాం!: బులంద్ షహర్ అత్యాచార బాధిత కుటుంబం

ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో లైంగిక దాడికి గురైన కుటుంబం మీడియా, రాజకీయ నాయకుల తీరుతో ఆవేదన చెందుతోంది. జరిగిన ఘటనపై గుచ్చిగుచ్చి ప్రశ్నించడంపై మండిపడుతోంది. ఆ దారుణంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బదులుగా ఇంటర్వ్యూలు, కథనాలు అంటూ పదేపదే జరిగిన దారుణాన్ని గుర్తు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు, రాజకీయనాయకులు ఆ ఇంటికి క్యూ కడుతుండడం, ఊళ్లో వాళ్లు వీరితో 'అత్యాచారానికి గురైన బాలిక ఇల్లేనా? అయితే ఇలా వెళ్లండి' అని అడ్రస్ చెబుతుండడం... ఆ కుటుంబాన్ని మరింత మనస్తాపానికి గురి చేస్తున్నాయి. దీంతో ఇంటి యజమాని మాట్లాడుతూ, 'ఇంకా మీరు తెలుసుకోవడానికి ఏముంది? చెప్పిందే ఎన్నిసార్లు చెప్పాలి? దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోండి. నా కూతురు, భార్యకు జరిగిన విషాదం గురించి ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా చెప్పాలి? ఇంకా ఏం మిగిలి ఉందని మీరు అనుకుంటున్నారు? రాత్రి వరకు నా కూతురు బాగానే ఉంది. అందరూ వచ్చి పదే పదే ప్రశ్నిస్తుండటంతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. మరోసారి కుప్పకూలింది. ఏమాత్రం ఆపకుండా ఏడుస్తూనే ఉంది. దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లిపోండి. మేం ఇక మీ ముందుకు రాము' అని చేతులెత్తి నమస్కరిస్తూ బ్రతిమాలారు.

More Telugu News