: కేజీ బేసిన్ రిపోర్టుకు మోదీ ఆమోదం పలికితే రిలయన్స్ సంస్థ కుదేలు: హెచ్చరించిన కాగ్

కృష్ణా గోదావరి చమురు క్షేత్రంపై ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మధ్య నెలకొన్న వివాదంలో 2013లో థర్డ్ పార్టీ ఇచ్చిన నివేదికకు కేంద్రం ఆమోదం పలికితే, ఆ ప్రభావంతో రిలయన్స్ కుదేలవుతుందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) హెచ్చరించింది. సంస్థపై ఆర్థిక భారం పెరుగుతుందని అభిప్రాయపడింది. బంగాళాఖాతంలోని తమ చమురు క్షేత్రం నుంచి సహజవాయువు, రిలయన్స్ బావుల్లోకి వెళుతున్న కారణంగా తమకు నష్టపరిహారం ఇవ్వాలని ఓఎన్జీసీ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై డీ గోల్యర్, మెక్ నాటన్ (డీఅండ్ఎం) విచారణ జరిపి 2013లో నివేదిక ఇచ్చింది. ఈ రెండు చమురు క్షేత్రాల మధ్య సహజవాయువు వలస వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదికలో పొందుపరిచారు. ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు వెల్లడిస్తూ, తాము రూ. 30 వేల కోట్లు నష్టపోయామని, దాన్ని రిలయన్స్ నుంచి వసూలు చేసి ఇప్పించాలని ఒఎన్జీసీ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ కొనసాగుతూ ఉంది. తమ బావులున్న ప్రాంతం చుట్టూ 350 మీటర్ల పరిధిలో వలయాకారంగా కొత్త బావులను తవ్విన రిలయన్స్, తమ గ్యాస్ ను తరలించుకుపోతున్నదన్నది ఒఎన్జీసీ వాదన. ఈ కేసులో ఒఎన్జీసీ గెలిచినా, డీఅండ్ఎం నివేదికను ప్రభుత్వం ఆమోదించినా, ఆ ప్రభావం రిలయన్స్ ను తీవ్రంగా దెబ్బతీస్తుందని చమురు రంగ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానించారు.

More Telugu News