: జైట్లీ ఏదో చెప్పారుగా... కాస్తయినా సమయం ఇవ్వకుండా ఈ గొడవేంటి?: ఆంధ్రా కాంగ్రెస్ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్

ఎప్పటిలానే నేటి పార్లమెంట్ సమావేశాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, అటు లోక్ సభ, ఇటు రాజ్యసభల్లో నిరసనల పర్వానికి తెరలేపారు. లోక్ సభ ప్రారంభం కాగానే, ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టనీయకుండా కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో పోడియంలోకి దూసుకురాగా, స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యంతరం తెలిపారు. "రోజూ ఏమిటిలా? మీరు దయచేసి ప్లకార్డులు చూపవద్దు. సభలో ప్లకార్డులపై నిషేధం ఉంది. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏదో చెప్పారుగా? కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. వారికి కాస్తయినా సమయం ఇవ్వకుండా ఈ గొడవేంటి? మాట్లాడుకొని వారు ఓ నిర్ణయానికి వస్తారు. ఆపై అనుమానాలు ఉంటే తీర్చుకోవచ్చు. నేను మిమల్ని కేవలం రిక్వెస్ట్ మాత్రమే చేయగలను. దయచేసి మీ సీట్లలోకి వెళ్లిపోండి. ప్లకార్డులు ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు" అని సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. స్పీకర్ సూచనలను పట్టించుకోని కాంగ్రెస్ ఎంపీలు 'ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు' అని నినదిస్తూ, పోడియంను వదల్లేదు.

More Telugu News