: టాల్గో హైస్పీడ్ రైలూ గంటన్నర ఆలస్యం!

న్యూఢిల్లీ నుంచి ముంబైకి 12 గంటల్లోపుగా చేరుకోవాలని బయలుదేరిన హైస్పీడ్ రైలు గంటన్నర ఆలస్యంగా ముంబై చేరుకుంది. ముంబైకి ఈ ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సిన రైలు 11:30కి వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన సెంట్రల్ రైల్వే, భారీ వర్షాలు రైలు వేగానికి బ్రేకులు వేశాయని పేర్కొంది. ఈ రైలు సోమవారం నాడు రాత్రి 7:55 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరింది. స్పెయిన్ లో తయారై ఇండియాకు వచ్చిన ట్రయిన్ లో రైల్వే శాఖ అధికారులతో పాటు స్పెయిన్ కు చెందిన పలువురు అధికారులు ప్రయాణించారు. గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో నడిపేలా దీన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. తిరుగు ప్రయాణంలో ఈ రైలు రేపు ముంబైలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. ఆపై రెండు, మూడవ దశ ట్రయల్స్ ను 5వ తేదీ, 9వ తేదీ నిర్వహించి, తుది ట్రయల్ ను 14న నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News