: గుజరాత్ లో ఆనందిబెన్ వారసుడెవరు!... అమిత్ షా మాత్రం కాదట!

గుజరాత్ సీఎం పదవికి స్వచ్చందంగా రాజీనామా చేస్తూ బీజేపీ సీనియర్ నేత ఆనందిబెన్ పటేల్ నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. 75 ఏళ్లు పైబడ్డ వారు పదవులను త్యజించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకే తాను రాజీనామా బాట పట్టినట్లు ఆనందిబెన్ చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, మరి ఆనందిబెన్ పటేల్ ఖాళీ చేసిన కుర్చీ ఎక్కేదెవరన్న ప్రశ్నపై ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. ఆనందిబెన్ పటేల్ స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నా... ఆ దిశగా బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం బీజేపీలో మోదీ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా ఉన్నది అమిత్ షానే. ఈ క్రమంలో అమిత్ షాను బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, గుజరాత్ వరకే పరిమితం చేసేందుకు ప్రధాని సిద్ధంగా లేరు. ఎందుకంటే వచ్చే ఏడాది కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాక పంజాబ్ లోనూ వచ్చే ఏడాదే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంతటి కీలక తరుణంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీకి బలం చేకూర్చిపెడుతున్న అమిత్ షాను మోదీ వదులుకునేందుకు సిద్ధంగా లేరన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అమిత్ షా కాకుంటే... ఆనందిబెన్ పటేల్ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్న విషయానికి వస్తే పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విజయ్ రూపానీ ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారు. నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, ఆనందిబెన్ పటేల్, గతంలో గుజరాత్ సీఎంలుగా పనిచేసిన బీజేపీ నేతలందరితోనూ సత్సంబంధాలే రూపానీకి కలిసివచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఏ ఒక్కరు కూడా రూపానీని వ్యతిరేకించే అవకాశాలు లేవు. ఇక రూపానీతో పాటు నితిన్ పటేల్, పురుషోత్తమ్ రూపాల్ ల పేర్లు కూడా సీఎం రేసులో ఉన్నాయి.

More Telugu News