: భారీ జనసమీకరణతో మోదీ ఇలాకాలో బలం చూపుతున్న కాంగ్రెస్!

నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసి కాంగ్రెస్ జెండాలు, సోనియాగాంధీకి స్వాగతం పలుకుతూ వెలిసిన బ్యానర్లతో నిండిపోయింది. యూపీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగనున్న వేళ, ఎన్నికల ప్రచార శంఖారావాన్ని వారణాసి నుంచి ప్రారంభించాలని సోనియా నిర్ణయించుకున్న వేళ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగాయి. సోనియాగాంధీ సహా, యూపీ సీఎం అభ్యర్థిని షీలా దీక్షిత్, కాంగ్రెస్ నేతలు రాజ్ బబ్బర్, గులాంనబీ ఆదాజ్ తదితరులు ర్యాలీగా నగరంలోకి రానుండగా, వారి ముందు 10 వేల మంది బైకర్లు తమ ద్విచక్ర వాహనాలపై పరుగు పెట్టనున్నారు. ఆపై జరిగే బహిరంగ సభకు లక్షలాది మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయని తెలుస్తోంది. మోదీ వచ్చిన తరువాత వారణాసి ప్రజలు బాధల్లో కూరుకుపోయారని ఆమె ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఎంపీగా ఉండి కూడా అభివృద్ధికి నోచుకోని వారణాసిని తాము తిరిగి గాడిన పెడతామని ఆమె తెలిపారు. కాగా, "పదమూడేళ్ల మోదీ పాలన కనీసం రెండేళ్ల అనందీ బెన్ పాలనకు సమానం కాదు" అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలో దళితులు నిరసనలు తెలియజేస్తున్నందునే ఆమెను తొలగించాలని భావిస్తున్నారని ఆరోపించారు. యూపీలోని 21 శాతం దళిత ఓటర్లు బీజేపీకి బుద్ధి చెప్పనున్నారని రాహుల్ జోస్యం చెప్పారు.

More Telugu News