: ప్రజలు ఆక్సిజన్ మాస్కులు ధరించి తిరిగే రోజు దగ్గరల్లోనే ఉంది: ఎన్‌జీటీ

ప్రజలు ఆక్సిజన్ మాస్కులు ధరించి తిరిగే రోజులు ఎంతో దూరంలో లేవని జాతీయ హరిత ధర్మాసనం(ఎన్‌జీటీ) ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రాజెక్టు కోసం అటవీ ప్రాంతాన్ని చదును చేసిన హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ఒక్క మొక్క కూడా నాటకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్‌జీటీ పైవిధంగా వ్యాఖ్యానించింది. ‘‘దేశంలో సగం ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మిగతా సగం నీళ్లు లేక దుర్భిక్ష పరిస్థితి ఎదుర్కొంటోంది. అతి చల్లని ప్రాంతమైన సిమ్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మీరెక్కడైనా ఒక్క మొక్కను నాటారేమో చూపించండి. రోడ్లు ఆక్సిజన్‌ను అందిస్తాయా? చెట్లు మాత్రమే ప్రాణవాయువును అందిస్తాయి’’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ‘‘ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుని తిరిగే రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన ఇటువంటి విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంది. రాష్ట్రంలో లక్ష మొక్కలు నాటిన తర్వాతే తమ ముందు హాజరు కావాలని పేర్కొంటూ విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.

More Telugu News