: శతకంతో అజేయంగా రెహానే!... రెండో టెస్టుపై మరింత పట్టు బిగించిన కోహ్లీ సేన!

కరీబియన్ గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ పై కన్నేసిన టీమిండియా రెండో టెస్టులో మరింత పట్టు బిగించింది. కొత్త కుర్రాడు లోకేశ్ రాహుల్ సత్తా చాటి జట్టు స్కోరును ఆధిక్యానికి చేర్చగా, అనుభవజ్ఞుడు అజింక్యా రెహానే సదరు ఆధిక్యాన్ని భారీ స్థాయికి పెంచేశాడు. వెరసి టీమిండియా ఆతిథ్య జట్టుపై ఫస్ట్ ఇన్నింగ్స్ లో 304 పరుగుల ఆధిక్యం సాధించింది. కింగ్ స్టన్ లోని సబీనా పార్కులో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 196 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ సేన రెండో రోజు ఆట ముగిసే సమయానికి 500 పరుగుల మైలురాయిని చేరుకుంది. నిన్న ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు చేజార్చుకున్న టీమిండియా 500 పరుగులు చేసింది. క్రీజులో సెంచరీ పూర్తి చేసిన అజింక్యా రెహానే (108) ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో మరో వికెట్ మాత్రమే మిగిలి ఉండటం, ప్రత్యర్థి జట్టుపై భారీ ఆధిక్యం సాధించిన నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ టీమిండియా ఇన్నింగ్స్ ను 500 పరుగుల మార్కు వద్ద డిక్లేర్ చేశారు. నేడు వెస్టిండిస్ తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. ఇప్పటికే 300లకు పైగా ఆధిక్యం సాధించిన నేపథ్యంలో మ్యాచ్ పై పట్టు సాధించిన టీమిండియా వరుసగా రెండో టెస్టులోనూ విజయావకాశాల దిశగా సాగుతోంది.

More Telugu News