: రియో ఒలింపిక్స్ లో పాల్గొననున్న నర్సింగ్ యాదవ్

రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది. నర్సింగ్ యాదవ్ వెనుక్ భారత రెజ్లింగ్ సమాఖ్య నిలవడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. డోపింగ్ కు పాల్పడ్డాడంటూ 'వాడా' రిపోర్టులు నిర్ధారించడంతో నర్సింగ్ యాదవ్ ఒలింపిక్ కలలు కల్లలయ్యాయి. అసలు రియో ఒలింపిక్స్ లో పాల్గొననున్న రెజ్లర్ల జాబితా విడుదలైన నాటి నుంచి నర్సింగ్ యాదవ్ ను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక దశలో పేరు ప్రఖ్యాతులున్న ఆటగాళ్లంతా నర్సింగ్ యాదవ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. న్యాయస్థానాల్లో కూడా అతని ప్రాతినిధ్యంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ దగ్గర పడిన క్రమంలో నర్సింగ్ యాదవ్ నిషేధిత డ్రగ్స్ వినియోగించాడంటూ ఫలితాలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరోపక్క, నర్సింగ్ యాదవ్ ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకిస్తున్న శిబిరంలో ఆనందం తాండవించింది. 'వాడా' ఫలితాలు రాగానే ప్రత్యర్థులు చేసిన ట్వీట్ తో తీగ కదిలింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరణ, అనుమానాలు విన్న రెజ్లింగ్ సమాఖ్య...అతనికి అండగా నిలిచింది. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన రెజ్లింగ్ సమాఖ్య దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలతో రియోకు నర్సింగ్ యాదవ్ నే పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు దర్యాప్తు వివరాలతో కూడిన నివేదికను ఒలింపిక్ సంఘానికి తెలపడం ద్వారా నర్సింగ్ యాదవ్ కు 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' కింద ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పించారు. దీంతో రియో ఒలింపిక్స్ లో నర్సింగ్ యాదవ్ పాల్గొనడంపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఇంత వివాదం మధ్య నర్సింగ్ యాదవ్ ఒలింపిక్ పతకం తేగలిగితే... అతని పేరు భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Telugu News