: ఇండియాపై వ్యూహాన్ని మారుస్తున్నాం: సోనీ

ఇకపై ఇండియాలో ప్రీమియం ఫోన్లను మాత్రమే విక్రయించాలని, తక్కువ ధరకు లభించే ఫోన్ల మార్కెటింగ్ ను నిలిపివేయాలని సోనీ నిర్ణయించింది. ఎక్స్ పీరియా బ్రాండ్ కింద పలు రకాల స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విక్రయిస్తున్న సంస్థ, ఇకపై ఎంపిక చేసిన ప్రొడక్టులను, పరిమిత మార్గాల ద్వారానే విక్రయాలు సాగిస్తామని సోనీ ఇండియా ఎక్స్ పీరియా బ్రాండ్ బిజినెస్ హెడ్ విజయ్ సింగ్ జైస్వాల్ వెల్లడించారు. తమ సంస్థ మార్కెట్ వ్యూహాన్ని మార్చుకోనుందని, స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో ప్రీమియం ఉత్పత్తులకే కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ఈ విభాగంలో మిగతా ప్రపంచంలో వ్యాపారంపై పెద్దగా ఆశలు లేవని, ఇండియాలో మాత్రం శ్రమిస్తే మంచి విక్రయాలు, ఆదాయం లభిస్తాయని భావిస్తున్నామని అన్నారు. భారత కస్టమర్ల కోసం మరిన్ని కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నామని, వచ్చే పండగ సీజన్ లో అందరినీ ఆకర్షించేలా ప్రత్యేక ఆఫర్లతో కూడిన ఫోన్లను మార్కెట్ కు పరిచయం చేస్తామని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో సోనీ సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆదాయ వృద్ధిలో ప్రపంచ సరాసరి 1.4 శాతం తగ్గగా, ఇండియా, బ్రెజిల్, చైనా, ఇండొనేషియాల నుంచి వచ్చే ఆదాయం 0.3 శాతం తగ్గింది.

More Telugu News