: నేను, సరిత కలసి 80ల్లో నటించిన సినిమా ఇది... శిరీష్ సినిమా అద్భుతం : చిరంజీవి

'శ్రీరస్తు శుభమస్తు' సినిమా సరితతో తాను 80ల్లో నటించిన ఒక సినిమా అన్న సంగతి ఎంతమందికి గుర్తుందో తనకు తెలియదని ప్రముఖ నటుడు చిరంజీవి గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, తాను సరితతో నటించిన ఆ సినిమా విజయం సాధించిందని, శిరీష్, లావణ్య నటించిన ఈ సినిమా రషెస్ చూశానని, ఈ సినిమా కూడా అద్భుతంగా ఉందని ఆయన చెప్పారు. తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే చేశానని ఆయన అన్నారు. ఈ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ చక్కని అభిరుచి, ఆధునిక భావాలు కలిగిన నిర్మాత అని అన్నారు. ఆయన సినిమాలు వరుసగా విజయం సాధించడం వెనుక ఆయన కృషి, పట్టుదల చాలా వున్నాయని చిరంజీవి చెప్పారు. గత పదేళ్ల ఆయన కెరీర్ ను పరిశీలిస్తే... హిందీలో 'గజని', తెలుగులో మరెన్నో సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాయని అన్నారు. కాలంతో పాటు పరుగులు తీయడం వల్లే అన్ని అద్భుత విజయాలు ఆయనకు సాధ్యమయ్యాయని ఆయన చెప్పారు. ప్రేమ పెళ్లిళ్లకు అభ్యంతరాలు చెప్పే తండ్రి, కుమారుడికి మధ్య జరిగే 'ఇగో క్లాషే' ఈ సినిమా అని ఆయన చెప్పారు. కత్తిమీద సాములాంటి ఈ కథను దర్శకుడు పరుశురాం మలచిన విధానం అద్భుతంగా ఉందని ఆయన చెప్పారు. ఏ కథనైతే ఆయన అనుకున్నారో దానిని అలాగే చిత్రీకరించారని ఆయన తెలిపారు. ఈ సినిమా చూడగానే తనకు 'బొమ్మరిల్లు' గుర్తుకువచ్చిందని ఆయన తెలిపారు. శిరీష్ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడని ఆయన అభినందించారు. గత రెండు సినిమాల్లో శిరీష్ కు నటనపై పట్టుకావాలనిపించిందని, ఈ సినిమాలో ఆ అనుమానాలు పోగొట్టాడని చిరంజీవి తెలిపారు. శిరీష్ నటుడవుతాడని తాను ఎప్పుడూ భావించలేదని, నిర్మాతగా మారతాడని భావించానని ఆయన తెలిపారు. ఎప్పుడూ లెక్కలు మాట్లాడే శిరీష్ ఒకరోజు వచ్చి, 'మావయ్యా, ఆర్టిస్టు అవుతా'నని అన్నాడని ఆయన గుర్తు చేసుకున్నారు. 'మన ఫ్యామిలీ అభిమానులు ఆదిరిస్తారు, నటించు' అని వెన్నుతట్టానని ఆయన తెలిపారు. శిరీష్ మిగలిన వారిలా హడావుడిగా సినిమాల్లో నటించకుండా నిదానంగా సినిమాల్లో నటిస్తూ, అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం విశేషమని, అది మంచి పద్ధతని ఆయన అభినందించారు.

More Telugu News