: సౌదీ అరేబియాలో భారతీయ నిరుద్యోగులకు ఆహారం అందించమని ఆదేశించిన సుష్మా స్వరాజ్

భారతీయ యువత ఎన్నో ఆశలతో సౌదీ అరేబియాకు వెళ్లి సరైన ఉద్యోగాలు దొరకక, ఆశ్రయం లేక, తిండికి కూడా నోచుకోక అర్ధాకలితో రోడ్లపై విశ్రమిస్తున్నారు. సౌదీఅరేబియాలో భారతీయుల ఈ ఆహార అగచాట్ల గురించి తెలుసుకున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సౌదీలోని జెడ్డాలో ఆకలితో అలమటిస్తున్న భారతీయుల ఆకలి తీర్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో పలువురు సిబ్బంది భారతీయుల సహకారంతో అన్నార్తుల ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా అధికారులు ఆహారం పంపిణీ చేస్తుండగా తీసిన ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో ఆమె పోస్టు చేశారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, కువైట్‌లలో అనేకమంది భారతీయులు నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. సౌదీ అరేబియాలో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. దీంతో ఉపాధి లేని భారతీయ కార్మికులకు ఉచితంగా ఆహార పదార్థాలను అందజేయాలని రియాద్‌ లోని ఇండియన్ కాన్సులేట్‌ ను ఆదేశించినట్టు సుష్మా తెలిపారు. నిరుద్యోగుల ఆహార పంపిణీని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న తోటి భారతీయ సోదరసోదరీమణులకు సాయపడాలని ఆమె సౌదీ అరేబియాలో వివిధ విధులు నిర్వహిస్తున్న 30 లక్షల మంది భారతీయులను కోరారు. కాగా, సౌదీ అరేబియాలో భారతీయులు చాలామందే ఉన్నారు. వీరిలో అత్యధికులు బ్లూకాలర్ వర్కర్లు కాగా, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల ఒడిదుడుకుల నేపథ్యంలో కుదేలైన సౌదీ అరేబియా ఇతర ఆదాయమార్గాలను వెతుక్కుంటోంది. ఈ క్రమంలో అక్కడ చాలా మంది జీవనోపాధిని కోల్పోతున్నారు. మరోవైపు పనులున్న వారికి అక్కడి సంస్థలు సరిగ్గా జీతాలు చెల్లించడం లేదు. దీంతో సౌదీఅరేబియా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. వలస కార్మికుల చట్టాలు, పని వేళలు స్థిరంగా లేవన్నది కూడా వాస్తవమేనని పలు నివేదికలు చెబుతున్నాయి.

More Telugu News