: హిందూ మతం ప్రమాదంలో ఉందంటూ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్య

హిందూ మతం ప్రమాదంలో ఉందంటూ బీజీపీ ఎంపీ ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోకాల్డ్ రక్షణదారుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు. తమిళనాడులోని ఆలయంలోకి దళితులను ప్రవేశించకుండా అడ్డుకోవడంతో వారు ఇస్లాం మతాన్ని పుచ్చుకోబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ అంశంపై స్పందించిన ఎంపీ మాట్లాడుతూ దళితులు మతం మారడం వల్ల హిందూ మతానికి ప్రమాదం లేదని, మతాన్ని రక్షిస్తున్నామని చెప్పుకుంటున్న సోకాల్డ్ రక్షణదారుల వల్లే మతానికి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. తమిళ నెల ఆది సందర్భంగా నాగపట్టణం‌లోని భద్రాకాళియమ్మాన్ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దళితులను అగ్రవర్ణాలకు చెందిన కొందరు అడ్డుకున్నారు. దీంతో దళితులందరూ మూకుమ్మడిగా ఇస్లాంలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ వార్తలను నాగపట్టణం జిల్లా అధికారులు కొట్టిపడేశారు. ‘‘దళితుల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటే వారు చర్చికో, మసీదుకో వెళ్తారు. దానికి మేం(దళితులు) బాధ్యులు కాలేం’’ అని దళిత ఎంపీ ఉదిత్ రాజ్ తేల్చి చెప్పారు. ‘‘హిందూ మతాన్ని రక్షిస్తున్నామని చెప్పుకుంటున్నవారు మతం ప్రమాదంలో పడిందని బాధపడుతున్నారు. అయితే అది దళితుల వల్ల కాదు, వారి వల్లేననే విషయాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు’’ అని విమర్శించారు. కాంబోడియాలో అతిపెద్ద హిందూ దేవాలయం ఉందని, కానీ అక్కడ ఒక్క హిందువు కూడా లేడని పేర్కొన్నారు.

More Telugu News