: ‘పఠాన్‌కోట్’ ఉగ్రదాడిలో పాకిస్థాన్ ప్రమేయం .. ఆధారాలు సమర్పించిన అమెరికా

పఠాన్‌కోట్ ఉగ్రదాడి వెనక తమ హస్తం లేదని ఇప్పటి వరకు బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్ అసలు స్వరూపాన్ని అమెరికా తాజాగా బయటపెట్టింది. ఉగ్రవాదులతో పాకిస్థాన్‌కు చెందిన జైషే-ఇ-మహమ్మద్(జేఈఎం) అధినేతలు తరచూ చేసిన సంభాషణలను అమెరికా బయటపెట్టింది. వంద పేజీలున్న ఈ ఆధారాన్ని భారత్‌కు అందించింది. అందులో ఉగ్రవాదుల సంభాషణలు, చాటింగులకు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయి. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి చొరబడిన నలుగురు ఉగ్రవాదులు 80 గంటలపాటు మారణకాండకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జేఈఎంకు చెందిన నాసిర్ హుస్సేన్, అబూ బకర్, ఉమర్ ఫరూఖ్, అబ్దుల్ ఖయ్యూం పాల్గొన్నారు. వీరందరూ పాకిస్థాన్‌కు చెందిన వారే. ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వీరు నిత్యం జేఈఎం అగ్రనేతలతో సంభాషణలు జరిపారు. చాటింగుల ద్వారా దాడికి వ్యూహ రచన చేశారు. ఈ మొత్తం వ్యవహారం పాక్ కేంద్రంగా నడిచినట్టు తాజాగా అమెరికా అందించిన ఆధారాల ద్వారా సుస్పష్టమైంది. ఆ ఆధారాలతో పఠాన్‌కోట్ దాడికి వెనుక పాక్ హస్తం ఉందని తేలిపోయింది. ఇన్నాళ్లు ఈ విషయంలో బుకాయిస్తూ వచ్చిన పాక్ ఇప్పుడేమంటుందో వేచి చూడాల్సిందే.

More Telugu News