: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణాలు... ఉద్దవ్ ఠాక్రేను కలిసిన రాజ్ ఠాక్రే

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సుదీర్ఘంగా మిత్రులుగా ఉన్న బీజేపీ, శివసేన బంధం పూర్తిగా విచ్చిన్నమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారపార్టీకి మద్దతిస్తున్నప్పటికీ కేంద్రంలో నాయకత్వ వైఖరితో శివసేన పూర్తిగా తెగదెంపులు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వారసత్వం కోసం విడిపోయిన సోదరులిద్దరూ ఒక్కటవుతున్నట్టు మహారాష్ట్ర రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు. ఈ క్రమంలో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేను ముంబై, బాంద్రాలోని ఆయన నివాసం 'మాతోశ్రీ'కి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే వెళ్లి కలిశారు. ఈ కలయికపై మహారాష్ట్రలో ఊహాగానాలు షురూ అయ్యాయి. విడిపోవడం ద్వారా జరిగిన నష్టాన్ని సోదరులిద్దరూ గుర్తించినట్టు కనిపిస్తోందని, వారిద్దరూ ఒక్కటవ్వడం ద్వారా ఇతర పార్టీలకు ఇబ్బందులు తప్పవని వారు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మహా ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తాచాటి తరువాత జరగనున్న స్థానిక ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాగా వేయాలని వారు భావిస్తున్నారు. కాగా, శివసేన అధినేత బాల్ ఠాక్రే అనంతరం కుమారుడు ఉద్దవ్ ఠాక్రే పార్టీ బాధ్యతలు స్వీకరించారు. బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడైన్ రాజ్ ఠాక్రే ఆయన ఉండగా పార్టీలో కీలక భూమిక పోషించి, ఆయన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో విభేదించి, సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

More Telugu News