: ఎంసెట్-2 రద్దు... ఎంసెట్-3 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం!

'ఎంసెట్-2'ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో లీకైన సమయాల్లో అవలంబించిన పద్ధతులు, ఆ సందర్భంగా న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-3 నిర్వహణకు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎంసెట్-2 రాయడం ద్వారా ఇబ్బంది పడ్డ విద్యార్థులకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఇక తెలంగాణ ఎంసెట్-2 రద్దయినట్టేనని, లీకేజీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులను క్షోభపెట్టినవారిని ఉపేక్షించవద్దని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సమాచారం. కాగా, ఈ ఘటనపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకూడదన్న ముందుచూపుతోనే ఎంసెట్-2ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. 40 రోజుల్లో పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

More Telugu News