: పెళ్లి చేసుకున్నాడు.. రెండు గంటల్లో తలాక్ చెప్పేశాడు!

తలాక్ విధానం ఓ యువతి జీవితానికి ఆశనిపాతం అయింది. వివాహం జరిగిన రెండు గంటల్లోనే విడాకులు తీసుకునే వెసులుబాటును తలాక్ విధానం కల్పించింది. కలకలం రేపుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌‌ లోని మీరట్‌‌ కి దగ్గర్లో దహా అనే గ్రామానికి చెందిన ఓ యువతికి పక్క ఊరికి చెందిన మహ్మద్ ఆరీఫ్‌ తో వివాహం చేశారు. వివాహం సందర్భంగా వివిధ కానుకలు ఇస్తామని వధువు తరపువారు మాటిచ్చారు. దీంతో అంతా సవ్యంగా సాగుతున్న దశలో కారు ఇవ్వలేదన్న విషయాన్ని వరుడు గుర్తించాడు. తనకు కారు కావాల్సిందేనని, తనన మోసం చేశారని ఆరోపిస్తూ, వధువుకు మూడు సార్లు తలాక్ చెప్పేశాడు. దీంతో షాక్ కు గురైన వధువు కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టించారు. అన్నీ ఇచ్చామని, కారుకు డబ్బు సర్దుబాటు కాకపోవడంతో ఇవ్వలేదని, కొంచెం వెసులుబాటు చిక్కగానే ఇచ్చేస్తామని చెప్పారు. దానికి అతను అంగీకరించకపోవడంతో, పంచాయతీ తన తీర్పు చెబుతూ... ఆమెకు అతను 2.5 లక్షల రూపాయల భరణం చెల్లించాలని, మూడేళ్లపాటు మహ్మద్ ఆరీఫ్ మళ్లీ వివాహం చేసుకోకూడదని షరతు విధించారు. ఈ షరుతులకు అంగీకరిస్తే వివాహ రద్దుకు అంగీకరిస్తామని, లేని పక్షంలో పంచాయతీ విధించే ఏ శిక్షనైనా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీటన్నింటికీ వరుడు అంగీకరించడంతో వివాహం జరిగిన రెండు గంటల్లోనే విడాకుల ఒప్పందం జరిగిపోయింది.

More Telugu News