: భారత ఐటీ కంపెనీల హనీమూన్ పార్టీ అయిపోయిందా? అవునంటున్న నిపుణులు!

భారత ఐటీ రంగం దూసుకుపోతోంది. గడచిన పదేళ్లలో తరచూ వినిపించిన మాటిది. అందుకు తగ్గట్టుగానే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు శరవేగంగా ఎదిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్టప్ సంస్థలు వెల్లువలా పుట్టుకు వచ్చి, తక్కువ ఫీజులతో మెరుగైన సేవలు అందిస్తుండటం, టెక్నాలజీ అప్ గ్రేడేషన్ పై మన కంపెనీలు దృష్టిని సారించి విజయవంతం కావడంలో విఫలం కావడంతో భారత ఐటీ రంగం భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. ఐటీ బూమ్ ఇండియాలో మొదలైనప్పటి నుంచి క్రమానుగుణంగా పెరుగుతూ వచ్చిన ఐటీ కంపెనీల ఈక్విటీలు ఇప్పుడు డీలా పడుతున్నాయి. ఒక దశలో బ్రాడర్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీల పెరుగుదలను మించి దూసుకెళ్లిన కంపెనీలు ఇప్పుడు సెన్సెక్స్ పెరుగుదలలో కనీసం నాలుగో వంతైనా లాభాలను నమోదు చేయలేకపోతున్నాయి. గడచిన మూడు నెలల వ్యవధిలో నిఫ్టీ-50 సూచిక 10 శాతం పెరిగింది. సెన్సెక్స్ కూడా దాదాపు ఇంతే లాభాలను అందించగా, స్టాక్ మార్కెట్ 15 నెలల గరిష్ఠ స్థాయిలో ఉంది. ఇదే సమయంలో ఐటీ సబ్ - ఇండెక్స్ ను పరిశీలిస్తే, ఈ మూడు నెలల వ్యవధిలో 3 శాతం నష్టపోయి కనిపిస్తోంది. ఈయూ నుంచి బయటకు రావాలని బ్రిటన్ ప్రజల ఓటింగ్, బలహీనంగా ఉన్న తొలి త్రైమాసిక ఫలితాలు, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థ, ఆదాయాలు తగ్గుతాయని, వృద్ధి గణాంకాలను తగ్గిస్తున్నామని స్వయంగా చెప్పడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ముంచిందని ట్రేడర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు మరింతగా నష్టపోనున్నాయని సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు అజయ్ బగ్గా అభిప్రాయడ్డారు. బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అంటూ ఎన్ని కొత్త మార్గాల్లో సేవలు ప్రారంభించినా, ప్రపంచ స్థాయి నాణ్యత కొరవడటమే ఇందుకు కారణమన్నారు. "భారత ఐటీ రంగంలోని కంపెనీల వృద్ధిపై అనుమానాలున్నాయి. అమేజాన్ వంటి సంస్థ క్లౌడ్ టెక్నాలజీ నుంచి 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతుంటే, భారత దిగ్గజ కంపెనీలు అందులో పదోవంతుగా 1 బిలియన్ డాలర్లను కూడా పొందలేకపోతున్నాయి" అని అన్నారు. ప్రపంచంలోని పెద్ద కంపెనీలు, ఐటీ స్టార్టప్ లను విరివిగా కొనుగోలు చేస్తూ, ముందుకు వెళుతుంటే, మన కంపెనీలు అక్కడే ఆగిపోయాయని బగ్గా అభిప్రాయపడ్డారు. కేవలం ఆయన మాత్రమే కాదు, గ్లోబల్ ఈక్విటీస్ రీసెర్చ్ ఎండీ త్రిప్ చౌదరి సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అధికాదాయ మార్గాల వైపు కంపెనీలు దృష్టి సారించకుంటే నష్టాలే అధికమని అంచనా వేశారు. ఇకనైనా వరల్డ్ కంపెనీల వేగాన్ని అందుకోకుంటే భారత ఐటీ ఇండస్ట్రీ హనీమూన్ పార్టీ ముగిసినట్టే!

More Telugu News