: కేజ్రీవాల్ నన్ను చంపించాలని కుట్ర పన్నారు: సంచలన ఆరోపణ చేసిన ఆప్ మాజీ మంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ తనను చంపించాలని చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసిన వేళ, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నుంచి తొలగించబడ్డ అసీమ్ అహ్మద్ ఖాన్ అదే తరహా ఆరోపణలతో కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ తన మరణాన్ని కోరుకుంటున్నారని ఆరోపించారు. "గడచిన తొమ్మిది పది నెలలుగా నాకు మరణగండాలు ఎదురవుతున్నాయి. నా కుటుంబం ఆపదలో ఉంది. కేజ్రీవాల్, మరికొందరు పార్టీ నేతలు నన్ను హతమార్చేందుకు కుట్ర పన్నారు" అని మీడియా ముందు ఖాన్ ఆరోపించారు. ఢిల్లీకి ఆహార, పౌరసరఫరాల, పర్యావరణ శాఖల బాధ్యతలు చేపట్టిన ఖాన్ ను, గత సంవత్సరం అక్టోబరులో తొలగించిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో ఓ భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు రూ. 6 లక్షలు లంచం పుచ్చుకున్న ఘటనలో కేజ్రీవాల్ ఆయనపై వేటు వేశారు. తనను చంపుతామని ఫోన్లలో బెదరిస్తున్నారని, వ్యక్తిగతంగానూ వచ్చి హెచ్చరికలు జారీ చేశారని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖాన్ వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ లకు లేఖలు రాశానని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. కేజ్రీవాల్ అసలు స్వరూపం ఏంటన్న విషయమై తన వద్ద కొన్ని ఆడియో, వీడియో టేపులు ఉన్నాయని, అందుకే తనను అంతమొందించాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను ఆప్ ప్రతినిధి దీపక్ బాజ్ పాయి తీవ్రంగా ఖండించారు. ఆయన నిరాధార ఆరోపణలను చేసేందుకు సరైన సమయాన్నే ఎంచుకున్నారని, అంతకుమించి మరేమీ లేదని అన్నారు. లంచం ఆరోపణలపై ఆయన్ను పదవి నుంచి తొలగించి, కేసును సీబీఐకి అప్పగించామని గుర్తు చేశారు.

More Telugu News