: అంతర్జాతీయ గణిత పోటీలో భారత విద్యార్థి జయకేతనం... 1300 మందిని ఓడించిన 14 ఏళ్ల తుషార్

అంతర్జాతీయ గణిత పోటీలో భారత విద్యార్థి సత్తా చాటాడు. దేశ ఖ్యాతిని మరోమారు సగర్వంగా చాటాడు. అబాకస్ లెర్నింగ్ ఆఫ్ హయ్యర్ అర్థమెటిక్(ఏఎల్ఏహెచ్ఏ) ఇంటర్నేషనల్ సంస్థ ఇండోనేషియలో ఈనెల 24న అంతర్జాతీయ గణిత పోటీ నిర్వహించింది. 18 దేశాలకు చెందిన 1,300 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. భారత్ తరపున అహ్మదాబాద్‌లోని హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాల విద్యార్థి తుషార్ తలావత్(14) కూడా పాల్గొన్నాడు. తన అద్భుత ప్రతిభతో అందరినీ ఓడించి విజేతగా నిలిచాడు. తుషార్ గెలుపుతో గురుకుల పాఠశాల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన తుషార్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల జడివాన కురుస్తోంది. ‘‘తుషార్ విజయం దేశానికి గర్వకారణం. గురుకుల విద్యావిధానంపై మళ్లీ అందరూ దృష్టిసారించేలా చేశాడు. తన ప్రతిభతో పురాతన వైదిక గణితం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాడు’’ అని ఆరెస్సెస్ అనుబంధ భారతీయ శిక్షా మండల్(బీఎస్ఎం) జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముకుల్ కనిత్కర్ అన్నారు. తుషార్ గతంలోనూ పలుమార్లు గణితంపై తనకున్న పట్టును ప్రదర్శించాడు. గతేడాది అక్టోబరులో గుజరాత్‌లో నిర్వహించిన పోటీలో 70 ప్రశ్నలకు కేవలం మూడు నిమిషాల్లో సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పోటీలో తుషార్ 5,300 మందిని ఓడించాడు. చెన్నైలో గత డిసెంబరులో జరిగిన జాతీయస్థాయి పోటీలో 4,300 మందిని ఓడించి విజేతగా నిలిచాడు.

More Telugu News