: ప్రాణాలు పోసే ‘సంజీవని’ వేటలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. హిమాలయాల్లో వెతుకులాట!

సంజీవని మొక్క.. రామాయణం తెలిసినవారికి ఈ మొక్క గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. లక్ష్మణుడి ప్రాణాలను రక్షించేందుకు హిమాలయాల్లో ఉన్న సంజీవని మొక్కను తీసుకురమ్మని రాముడు, హనుమంతుడికి పురమాయిస్తాడు. మొక్కను గుర్తించలేని హనుమంతుడు ఏకంగా పర్వతాన్నే మోసుకొస్తాడు. ఇది వేరే కథ. రామాయణంలో వినడమే తప్ప ఈ మొక్క ఉందని కచ్చితంగా చెప్పే వారు లేరు. అయితే, ప్రాణాలు కాపాడే ఈ మొక్క హిమాలయాల్లో ఉందని చాలామంది చెబుతుంటారు. లేదని ఇంకొందరు కొట్టిపడేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం ఈ పురాణమొక్క హిమాలయాల్లో ఉందనే నమ్ముతోంది. అక్కడ ఈ మొక్కలు పెరుగుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం దానిని వెతికి పట్టుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. హిమాలయాల్లో ఎన్నో ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వాటిలో సంజీవని కూడా ఒకటిని చాలామంది అభిప్రాయం. అయితే శతాబ్దాలుగా వెతుకుతున్నా ఇప్పటి వరకు దాని ఆచూకీ లభించలేదు. ‘‘మేం ప్రయత్నిస్తున్నాం. మా ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కాదు. తప్పకుండా సంజీవనిని కనుక్కుంటాం’’ అని రాష్ట్ర మంత్రి సురేందర్ సింగ్ నేగి విశ్వాసం వ్యక్తం చేశారు. చైనా సరిహద్దులో హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి ప్రాంతంలో ఈ మొక్క ఉన్నట్టు తెలుస్తోందని, అక్కడి నుంచే హనుమంతుడు సంజీవనిని తీసుకొచ్చాడని నమ్ముతున్నట్టు మంత్రి చెప్పారు. ఈ మొక్కను వెతికేందుకు ప్రాథమికంగా రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు నుంచి సైంటిస్టులు ఈ పనిలో ఉంటారని తెలిపారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చే సంజీవని మొక్క గురించి పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు. చీకట్లో మెరిసే ఈ మొక్కలు హిమాలయాల్లో పెరుగుతాయని చెబుతారు. యుద్ధంలో మూర్ఛపోయి మరణానికి చేరువవుతున్న లక్ష్మణుడిని తిరిగి బతికించింది ఇదేనని రామాయణం చదివిన, విన్న వారికి తెలుసు. ఈ మొక్క గురించి శతాబ్దాలుగా వెతుకుతున్నా ఇప్పటి వరకు దాని జాడలేదు. ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారికంగా రంగంలోకి దిగింది. మరి అద్భుతమైన ఈ పురాణ మొక్కను పట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. దొరికితే కనుక వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

More Telugu News