: ఏపీ ప్రజలకు చెబుతున్న సాకులు యూపీ, రాజస్థాన్ ప్రజలకు చెప్పగలరా?: రేణుకా చౌదరి సూటి ప్రశ్న

'మా తెలుగు తల్లికి...' అని తెలుగు రాష్ట్రంలో విద్యార్థులంతా పాడుతుంటారని, తమకు విభేదాలు లేవని, తమకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్న రీతిలో ఏపీకి కేంద్రం అరచేతిలో స్వర్గం చూపించిందని అన్నారు. సాక్షాత్తూ ప్రధాని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని ఆమె నిలదీశారు. ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేకహోదా కోసం అడుక్కోవాలా?... రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏమయ్యాయి? అని ఆమె నిలదీశారు. 'కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు. నిజమే, అయితే, విభజన వెనుక ఉన్న కారణాలు ఏంటి?' అని ఆమె అడిగారు. తెలుగు వారనే చిన్న చూపా? అని ఆమె ప్రశ్నించారు. మా ప్రజల మంచితనం బలహీనత కాదని త్వరలోనే గ్రహిస్తారని ఆమె హెచ్చరించారు. ప్రత్యేకహోదా అనేది గేటు ముందు రాసుకునే నేమ్ ప్లేట్ కాదని ఆమె అన్నారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న సంగతి గ్రహించాలని రేణుకా చౌదరి తెలిపారు. పార్లమెంటుకు వచ్చే ప్రతి బిల్లు మనీ బిల్లే అని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడ జరిగే ప్రతి చట్టం వెనుక కారణం డబ్బే ఉంటుందని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సాకులు చెప్పవద్దని ఆమె తెలిపారు. ఇవే సాకులు యూపీ, రాజస్థాన్ ప్రజలకు చెప్పగలిగి ఉండేవారా? అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరిగే వరకు సోనియా, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆమె తెలిపారు. ఇది పూర్తిగా ఏపీ ప్రజలపై వివక్ష చూపించడమేనని ఆమె ఆరోపించారు. 'దొరుకునా ఇటువంటి సేవ' అని భావించి... ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆమె సూచించారు.

More Telugu News