: మిషెల్లీ ప్రసంగం.. కన్నీటి పర్యంతమైన డెలిగేట్లు!

అవును.. అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా ప్రసంగం డెలిగేట్ల కంట కన్నీరు తెప్పించింది. ఆమె ప్రసంగంతో ఉద్వేగానికి లోనైన డెలిగేట్లు కొందరు హర్షాతిరేకాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా మరికొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మంగళవారం ఫిలడెల్ఫియాలో పార్టీ జాతీయ సదస్సులో మిషెల్లీ ప్రసంగించారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌కు ఆమె మద్దతు ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ట్రంప్‌ను విమర్శలతో కడిగిపారేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారు అధ్యక్ష పదవికి ఏ విధంగానూ సరిపోరని పేర్కొన్నారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టాలన్న ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమెరికా ప్రపంచంలోనే గొప్ప దేశమని పేర్కొన్న మిషెల్లీ ఆఫ్రికా-అమెరికా జాతీయుడిని అధ్యక్షుడిని చేయడంతోనే ఆ విషయం అర్థమైందన్నారు. ఇప్పుడు ఓ మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారని, ఆమెను ఎన్నుకోగలిగే అవకాశం లభించడం గొప్ప దేశానికి మరో నిదర్శమని మిషెల్లీ అన్నారు. బానిసలు నిర్మించిన శ్వేత సౌధంలో పెరుగుతున్న తన పిల్లల తండ్రి పౌరసత్వాన్ని ప్రశ్నించేవారిని విస్మరించాలంటూ పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. పావుగంట సేపు ఏకధాటిగా మాట్లాడిన మిషెల్లీ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.

More Telugu News