: చివరి అరగంటలో అమ్మకాల వెల్లువతో ఆవిరైన స్టాక్ మార్కెట్ లాభాలు!

సెషన్ ఆరంభం నుంచి పడుతూ లేస్తున్న సెన్సెక్స్, నిఫ్టీలు అధిక సమయం లాభాల్లో నిలిచినప్పటికీ, మధ్యాహ్నం తరువాత ప్రారంభమైన యూరప్ మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంటును ఒక్కసారిగా హరించివేసింది. దీంతో 3 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల వరకూ లాభంలో ఉన్న సెన్సెక్స్ సూచిక, అరగంట వ్యవధిలో 140 పాయింట్లు దిగజారింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో రూ. 46 వేల కోట్ల మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది. ఇదే సమయంలో మిడ్ క్యాప్ కంపెనీలు మెరుపులు మెరిపించడం గమనార్హం. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 118.82 పాయింట్లు పడిపోయి 0.42 శాతం నష్టంతో 27,976.52 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 45.00 పాయింట్లు పడిపోయి 0.52 శాతం నష్టంతో 8,590.65 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.17 శాతం లాభపడగా, స్మాల్ కాప్ 0.69 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 13 కంపెనీలు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, హీరోమోటో కార్ప్, అరవిందో ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,898 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,038 కంపెనీలు లాభాలను, 1,660 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 1,08,03,091 కోట్లుగా నమోదైన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,07,57,128 కోట్లకు తగ్గింది.

More Telugu News