: మెగాస్టార్ మెచ్చుకోవడం.. బ్రహ్మానందం భోజనానికి పిలవడం మర్చిపోలేను: ‘జబర్దస్తు’ ఫేమ్ ఆర్పీ

చిన్నప్పటి నుంచి నలుగురినీ నవ్వించడం తనకు అలవాటని.. అదే తనకు వరమని, ఆ వరంతోనే తాను ఈరోజు బుల్లితెరలో వస్తున్న ‘జబర్దస్త్’ లో నటిస్తున్నానని ఆర్పీ గా ఫేమ్ అయిన రాటకొండ ప్రసాద్ చెప్పాడు. నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం సగుటూరు గ్రామానికి చెందిన ఆర్పీ తన మిత్రుడిని కలిసేందుకని వాలయనందపురానికి నిన్న ఆయన వెళ్లగా, అక్కడ మీడియాతో ముచ్చటించాడు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమని, ఇంట్లో పూట గడవని పరిస్థితుల్లో తాను హైదరాబాద్ కు చేరానని నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రాక, చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో... హోటల్లో సప్లయర్ గా, బస్తాలు మోస్తూ డబ్బులు సంపాదిస్తూ, సినీ ఛాన్స్ ల కోసం ప్రయత్నం చేశానన్నాడు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు పీఏ ద్వారా తనకు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ రావడంతో కొన్ని చిత్రాలకు పనిచేశానన్నాడు. ఆ తర్వాత తాను రచించిన కథ హీరో శ్రీహరికి నచ్చడంతో, తనతో సినిమా తీస్తానని ఆయన ప్రకటించారని, అయితే కొద్దికాలానికే ఆయన మృతి చెందడంతో తనకు నిరాశ ఎదురైందని అన్నాడు. ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం, దానికి జాతీయ అవార్డు రావడం, ఈ క్రమంలో నటుడు ధన్ రాజ్ ను కలిసి ‘జబర్దస్త్’ లో తనకు అవకాశమివ్వాలని అడగటం జరిగిందన్నాడు. ఆ విధంగా, ‘జబర్దస్త్’ లో తన ప్రయాణం మొదలైందని చెప్పిన ఆర్పీ, తాను మర్చిపోలేని రెండు విషయాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘జబర్దస్త్’లో నాకు నచ్చిన నటుడు ఆర్పీ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన ఇంటికి భోజనానికి ఆహ్వానించడం మరిచిపోలేని, ఇవి సంతోషకరమైన సంఘటనలని ఆర్పీ చెప్పుకొచ్చాడు.

More Telugu News